దర్శకేంద్రుడితో బాలకృష్ణ..!

నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా ఇచ్చిన ప్రోత్సాహంతో ఆయన మరిన్ని సినిమాలను లైన్ లో పెడుతున్నారు. త్వరలోనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు బాలయ్య. ఇదిలా ఉండగా.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.

అది కూడా శ్రీ రామానుజాచార్యుల కథ అని తెలుస్తోంది.
ఇందులో బాలకృష్ణ.. రామానుజులు పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. రామానుజులు.. వేదాంత సాగరం, వేదాంత సంగ్రహం, వేదాంత దీపం అనే గ్రంథాలు రాశారు. బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యం రచించారు.

అటువంటి వ్యక్తి జీవితచరిత్రను సినిమాగా తీయాలనుకుంటున్నారు. ప్రముఖ రచయిత జె.కె.భారవి సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఈయన ‘శ్రీ మంజునాథ’, ‘శ్రీరామదాసు’ వంటి సినిమాలకు రచయితగా పని చేశారు. టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాత ‘రామానుజులు’ ప్రాజెక్ట్ ను సెట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈమేరకు రాఘవేంద్రరావుని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆయన గనుక ఓకే చెబితే.. బాలయ్యతో ఈ సినిమా చేయాలనుకుంటున్నారు. గతంలో బాలయ్య ప్రధాన పాత్రలో ‘పాండురంగడు’ అనే సినిమా తీశారు దర్శకేంద్రుడు. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా సెట్ అవుతుందేమో చూడాలి!