ప్రభాస్ – అశ్విన్ సినిమాలో అతనున్నాడు

ప్రభాస్ చేతిలో ఉన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో ‘ప్రాజెక్ట్-కె’ ఒకటి. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్, లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీదత్‌లతో కలిసి ప్రభాస్ చేస్తున్న ఈ చిత్రం ఇటీవలే సెట్స్ మీదికి వెళ్లింది. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్లో తెరకెక్కబోతున్న చిత్రంగా చెబుతున్నారు. దాదాపు రెండేళ్ల పాటు ప్రి ప్రొడక్షన్ చేశారంటే ఈ సినిమా స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దాదాపు రూ.500 కోట్ల ఖర్చుతో ఈ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు.

ఇలాంటి మెగా ప్రాజెక్టుకు దానికి స్థాయిలోనే టెక్నీషియన్లను తీసుకుంటారని అనుకున్నారు. ఐతే ‘ప్రాజెక్ట్-కె’కు సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్‌ను ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మిక్కీ ప్రతిభను తక్కువ చేయడం కాదు కానీ.. అతను ఈ స్థాయి భారీ చిత్రాలకు ఇప్పటిదాకా పని చేసింది. లేదు. ఈ రేంజ్ అనే కాదు.. ఇప్పటిదాకా పెద్ద హీరోల సినిమాలకే వర్క్ చేయలేదు.

ఐతే ‘మహానటి’కి అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం అందించి సినిమాకు ప్రాణం పోయడంతో మిక్కీ మీద నమ్మకంతో నాగ్ అశ్విన్.. అతణ్ని ‘ప్రాజెక్ట్-కె’ కోసం ఎంచుకున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. ఐతే తర్వాత చిత్ర బృందం ఆలోచన మారిందని.. ఇలాంటి భారీ సినిమా స్థాయికి తగ్గట్లు పెద్ద సంగీత దర్శకుడిని ఎంచుకోవాలని చూస్తున్నారని.. మిక్కీని తప్పిస్తున్నారని వార్తలొచ్చాయి. కానీ ఆ ప్రచారం నిజం కాదని తేలింది. తన సంగీత దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’ ప్రమోషన్ల కోసం మీడియాను కలిసిన మిక్కీ.. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో ఒకటిగా ‘ప్రాజెక్ట్-కె’ను పేర్కొన్నాడు.

ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని.. ఐతే ఈ సినిమా సంగీత చర్చలు ఇంకా మొదలు కాలేదని వెల్లడించాడు. కాబట్టి మిక్కీనే ఈ మెగా మూవీకి సంగీత దర్శకుడిగా కొనసాగబోతున్నాడన్నమాట. ‘మహానటి’కి పని చేసిన స్పానిష్ సినిమాటోగ్రాఫర్ డానీ సాంచెజ్‌యే ఈ చిత్రానికి కూడా సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రపంచంలోనే అతి పెద్ద కెమెరాను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.