ఓటీటీ జమానాలో.. ట్రాక్టర్లలో సినిమాకు

కాలం మారింది. అందులో భాగంగా వచ్చి పడిన కరోనా మనిషి జీవన గమనాన్ని మార్చేసింది. ఎంతలా.. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో అంతులేని మార్పునకు కేరాఫ్ అడ్రస్ గా కొవిడ్ నిలిచింది. ఒకవేళ కరోనా కానీ రాకుంటే.. ఈ రోజున ఓటీటీ వేగం ఇంతలా ఉండేది కాదేమో. కనీసం.. మరో మూడునాలుగేళ్లు సమయం తీసుకునేదేమో? లాక్ డౌన్ పుణ్యమా అని వినోద రంగంలో వచ్చిన మార్పులు అన్ని ఇన్ని కావు.

ఇదంతా ఎందుకంటే.. ఓటీటీలు వాయు వేగంతో విస్తరిస్తున్న వేళ.. థియేటర్ వద్దకు ప్రేక్షకులు వస్తారా? వచ్చినా.. కరోనా ముందు లాంటి సీన్లు థియేటర్ల వద్ద కనిపిస్తాయా? అన్న ప్రశ్న పలువురి నోట వినిపించే పరిస్థితి. అలాంటి అనుమానాల్ని పటాపంచలు చేసింది బాలయ్య నటించిన ‘అఖండ’.అంచనాలకు మించిన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీ.. రికార్డు కలెక్షన్లను తీసుకురావటమే కాదు.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక కొత్త ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పాలి.

అఖండ మూవీ సూపర్ సక్సెస్ రేంజ్ ఎంతన్న మాటకు ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఒక ఉదాహరణ చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. సాధారణంగా.. గ్రామాల్లో సినిమాలు చూసేందుకు.. జనాలు జట్లు.. జట్లుగా ఎద్దుల బండ్లు.. ట్రాక్టర్లు కట్టుకొని టౌన్ కు వెళ్లి సినిమా చూసేవారు. ఇదంతా దాదాపు ముప్ఫై.. నలబై ఏళ్ల క్రితం. కానీ.. నాటి సీన్ నేడు మళ్లీ రిపీట్ కావటం.. అందుకు అఖండ కారణం కావటం ఒక విశేషంగా చెప్పాలి.

అఖండ మూవీని చూడటానికి గుంటూరు జిల్లా పెదనందిపాడు అనే ఊరు ఉంది. ఇది గ్రామానికి ఎక్కువ.. మున్సిపాల్టీకి తక్కువ. అలాంటి చోట.. అక్కడి గ్రామస్తులు.. మరి ముఖ్యంగా.. మహిళలు ‘అఖండ’ మూవీ చూడటానికి ట్రాక్టర్లు కట్టుకొని థియేటర్ వద్దకు రావటం హాట్ టాపిక్ గా మారింది. అఖండ.. ఎంతటి అఖండమైన విజయాన్ని సాధించిందనటానికి ఈ సీన్ ఒక నిదర్శనంగా చెప్పక తప్పదు. ఓటీటీలు వచ్చేసి.. సినిమా విడుదలైన నెల లోపే ఇంట్లోకి వచ్చేస్తున్న వేళ.. అది కాదనుకొని.. వెండితెర మీద చూడాలని తపించిన వైనం చూస్తే.. అఖండ ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందన్న విషయం ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి.