తెరపై డేయ్యం సినిమాలు చూసి మనం భయపడటం మామూలే. కొన్నిసార్లు ఆ సినిమాలు రోజుల పాటు వెంటాడుతుంటాయి. కలల్లోనూ అవే గుర్తుకొచ్చి భయపడుతుంటాం. ఐతే ఇలాంటి సినిమాల్లో నటించేవాళ్లకు ఏ ఫీలింగ్స్ ఉండవనే అనుకుంటాం. తాము చేస్తున్నదంతా నటనలో భాగమే కాబట్టి షూటింగ్లో సరదాగానే అనిపిస్తుంది.
ఆ తర్వాత సినిమా చూసినపుడు కూడా వాళ్లకు ఏ ఫీలింగ్ కలగదనే అనుకుంటాం. కానీ ఒక కథానాయిక మాత్రం తాను నటించిన హార్రర్ సినిమాతో ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి చాలా ఇబ్బంది పడిందట. తాను నటించిన సినిమాలోని సన్నివేశాలు వెంటాడటంతో దాదాపు రెండు నెలలు సరిగా నిద్రే పోలేదట. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. పూర్ణ.
ఈమె పేరెత్తగానే ఆటోమేటిగ్గా ప్రేక్షకులకు ‘అవును’ సినిమానే గుర్తుకొస్తుంది. రవిబాబు రూపొందించిన ఈ హార్రర్ మూవీ అప్పట్లో సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే.సినిమా చూసిన వాళ్లందరూ భయపడటంలో ఆశ్చర్యం లేదు కానీ.. తనను కూడా ఆ సినిమా తెగ భయపెట్టేసిందని పూర్ణ ఓ టీవీ షోలో వెల్లడించింది. ‘‘అవును సినిమా చేసినంత కాలం నాకు ఎలాంటి భయం కలగలేదు. ఎంతో సరదాగానే షూటింగ్ చేశాం. కానీ అది విడుదలయ్యాక మాత్రం నా ఆలోచనలు మారిపోయాయి.
థియేటర్లో ఆ సినిమా చూసి దాదాపు రెండు నెలల పాటు నిద్ర పోలేదు. చీకటి పడితే భయం వేసేది. ఆఖరికి స్నానం చేసే సమయంలోనూ నా పక్కన ఎవరైనా కూర్చున్నారా అని కంగారు పడేదాన్ని. అంతగా ఆ సినిమా నన్ను భయపెట్టేసింది’’ అని పూర్ణ వెల్లడించింది. ‘అవును’ తర్వాత సరైన అవకాశాలు రాకపోవడం, నటిగా బిజీ కాలేకపోవడంపై పూర్ణ స్పందిస్తూ.. సినిమాల విషయంలో తన ప్లానింగ్ సరిగా లేదని.. సినీ పరిశ్రమలోకి వచ్చాక చాలా సార్లు ‘ఎస్’ చెప్పాల్సి ఉంటుందని, తాను ‘నో’ చెప్పానని ఆమె అంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates