టాలీవుడ్లో చాలా స్పీడుగా సినిమాలు చేసుకుపోయే స్టార్ హీరోల్లో రవితేజ పేరు ముందు వరుసలో ఉంటుంది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా చాలా వేగంగా సినిమాలు చేసుకుపోతుంటాడు మాస్ రాజా. అతడి స్థాయి హీరోల్లో తనంత స్పీడు ఇంకెవరికీ లేదనడంలో మరో మాట లేదు. ఏడాదికి మూడు సినిమాలు అలవోకగా లాగించేస్తాడతను.
అందులోనూ క్రాక్ మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో రవితేజ స్పీడు ఇంకా పెరిగిపోయింది. కరోనా ప్రభావం లేకుంటే ఈ ఏడాదే ఖిలాడి మూవీతో రవితేజ పలకరించాల్సింది. కానీ అది వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఐతే క్రాక్ తర్వాత ఏడాదికి పైగా విరామం వస్తోందని మాస్ రాజా ఫ్యాన్స్ నిరాశ చెందాల్సిన పని లేదు. ఈ గ్యాప్ తాలూకు వడ్డీని కూడా తిరిగిచ్చేసేలా పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగుతున్నాడు రవితేజ.
కొత్త ఏడాదిలో మాస్ రాజా మోత మామూలుగా ఉండబోదు. నాలుగు నెలల వ్యవధిలో మూడు క్రేజీ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు రవితేజ. ఆల్రెడీ ఫిబ్రవరి 11కు ఖిలాడి మూవీ షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. ఇంకో నెలన్నరకే, మార్చి 25న రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్ చేయబోతున్నట్లు సోమవారమే ప్రకటించారు. ఇవి రెండూ మంచి క్రేజున్న సినిమాలే. ఖిలాడి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా.. రామారావు చిత్రీకరణ చివరి దశలో ఉంది.
రవితేజ ఇప్పటికే ఇంకో సినిమా చిత్రీకరణలోనూ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రానికి ధమాకా అనే టైటిల్ కూడా ఖరారవడం విదితమే. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ సగం పూర్తయింది. ఇంకో రెండు మూడు నెలల్లో ఆ సినిమాను కూడా రవితేజ అవగొట్టేస్తాడు. ఆ చిత్రాన్ని వేసవి కానుకగా మే లేదా జూన్‌లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అంటే నాలుగు నెలల వ్యవధిలో మూడు సినిమాలతో సందడి చేయబోతున్నాడన్నమాట మాస్ రాజా.