తెలుగు దర్శకుల కోసం మణిరత్నం వేట

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం వయసు 64 ఏళ్లు. ఐతే ఆయన సినిమాలు చూస్తే.. తనకు ఇంత వయసు ఉంటుందని అనిపించదు. కాలానికి తగ్గట్లు అప్ డేట్ అవడం ఆయన స్పెషాలిటీ. ఆయన దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలు నడుస్తున్న కాలాని కంటే చాలా ముందుంటాయి. సినిమా ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ మణిరత్నం ఔట్ డేటెడ్ అని ఎప్పుడూ అనిపించుకోలేదు. ట్రెండీగానే సినిమాలు తీస్తారు.

ఇప్పుడు వెబ్ సిరీస్‌ల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లు మణిరత్నం తనను తాను అప్ డేట్ చేసుకోవడానికి రెడీ అయ్యాడు. మణిరత్నం ఓ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కోసం వెబ్ సిరీస్ తీయబోతున్నట్లు ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఫ్లాట్ ఫామ్ అమేజాన్ ప్రైమ్ అని వెల్లడైంది. దీని కోసం పెద్ద బడ్జెట్లో ఒక ప్రాజెక్టు బాధ్యతల్ని మణిరత్నం నెత్తికెత్తుకున్నారట.

తొమ్మిది ఎపిసోడ్లతో నడిచే ఈ వెబ్ సిరీస్ ఓ చారిత్రక కథాంశం నేపథ్యంలో నడుస్తుందట. తొమ్మిది ఎపిసోడ్లను వేర్వేరు దర్శకులు తీస్తారని సమాచారం. మణిరత్నం ఒకటి రెండు ఎపిసోడ్లు తీసే అవకాశముంది. మొత్తంగా ప్రాజెక్టు పర్యవేక్షణ అంతా మణిదే. ఈ సిరీస్ కోసం ఆయన తమిళంతో పాటు తెలుగు దర్శకులను కూడా తీసుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం వేట సాగిస్తున్నారట. తన కథాంశానికి తగ్గ దర్శకులు ఎవరు అని ఆయన టాలీవుడ్ దర్శకుల వైపు చూస్తున్నారట. ఇక్కడి పరిచయస్థులతో చర్చలు కూడా జరుపుతున్నారట.

మరి మణిరత్నం పర్యవేక్షణలో ఆయన తీస్తున్న తొలి వెబ్ సిరీస్‌లో ఎపిసోడ్లను డైరెక్ట్ చేసే అరుదైన అవకాశం అందుకునే తెలుగు దర్శకులు ఎవరో చూడాలి. మరోవైపు మణిరత్నం తన కలల ప్రాజెక్టు ‘పొన్నియన్ సెల్వన్’ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల దానికి బ్రేక్ పడింది.