ఇంత నిర్లక్ష్య‌మా.. మెగాస్టార్ ఫొటో పెట్టేసింది

Shobha De

శోభా డే అని ఉత్త‌రాదిన‌ పేరుమోసిన కాల‌మిస్ట్, నావ‌లిస్ట్. సామాజిక అంశాల‌పై చాలా చురుగ్గా స్పందిస్తుంటుంది. సోష‌ల్ మీడియాలోనూ చాలా యాక్టివ్. ఆమె చేసిన ఓ ప‌ని ఇప్పుడు ట్విట్ట‌ర్లో మెగాస్టార్ చిరంజీవి అభిమానుల‌కు ఒళ్లు మండేలా చేసింది. ఆదివారం ఉద‌యం క‌న్న‌డ హీరో, సీనియ‌ర్ న‌టుడు అర్జున్ మేన‌ల్లుడు అయిన చిరంజీవి స‌ర్జా గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం పాలైన సంగ‌తి తెలిసిందే.

ఐతే చిరంజీవి అనే పేరు చూసి అది మ‌న మెగాస్టార్ అనుకున్న శోభా డే.. క‌నీసం వెరిఫై చేసుకోకుండా ట్వీట్ పెట్టేసింది. ఆయ‌న ఫొటో కూడా పెట్టేసి.. భార‌తీయ‌ సినీ ప‌రిశ్ర‌మ మ‌రో దిగ్గ‌జాన్ని కోల్పోయిందంటూ ట్వీట్ వేసేసింది.

ఈ మ‌ధ్యే ఇర్ఫాన్ ఖాన్, రిషి క‌పూర్ లాంటి లెజెండ్స్ మృతి చెందిన నేప‌థ్యంలో ఈ కోవ‌లో చిరంజీవి పేరు చేర్చేసింది. ఐతే మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండియా మొత్తం ఎంత పాపుల‌రో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. అలాంటి వ్య‌క్తి గురించి ఇలాంటి అప్ డేట్ ఇస్తున్న‌పుడు కొంచెం కూడా జాగ్ర‌త్త ప‌డ‌క‌పోవ‌డం దారుణం.

ఆయ‌న ఫొటో పెట్ట‌డం చూసి మెగాస్టార్ అభిమానులకు ఒళ్లు మండిపోయింది. ఆమెపై విరుచుకుప‌డ్డారు. ఐతే త్వ‌ర‌గానే త‌ప్పును గుర్తించి ఆమె ట్వీట్‌ను డెలీట్ చేసింది. ఐతే ఈ విష‌యంలో ఆమె నిర్ల‌క్ష్యం మాత్రం స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌టంతో మెగా అభిమానుల ఆగ్ర‌హం త‌గ్గ‌ట్లేదు. ఆమెను తిడుతూనే ఉన్నారు.