డైరెక్టర్ శ్రీనువైట్ల ఇంట తీవ్ర విషాదం

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల ఇంట తీవ్ర విషాదం ఏర్పడింది. శ్రీను వైట్ల తండ్రి కృష్ణారావు ఈ రోజు తెల్లవారుఝామున 4గంటలకు తుది శ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా కందుపాలెంలో నివసిస్తున్న కృష్ణారావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కృష్ణారావు మృతితో శ్రీను వైట్ల కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

కృష్ణారావు అంత్యక్రియలు ఈ రోజు కందులపాలెంటో జరగనున్నట్లు తెలుస్తోంది. కృష్ణారావుకు శ్రీనువైట్లతోపాటు ఒక కుమార్తె ఉన్నారు. ఈ విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు….శ్రీను వైట్లకు ఫోన్ చేసి తమ సంతాపం తెలిపారు. కృష్ణారావు ఆత్మకు శాంతిచేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.

శ్రీనువైట్ల ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా ఢీ చిత్రం సీక్వెల్…‘ఢీ అంటే ఢీ’ని తెరకెక్కిస్తున్నారు. 2011లో దూకుడు, 2013లో బాద్షా వంటి బ్లాక్ బస్టర్ హిట్లు అందించిన శ్రీను వైట్ల…ఆ తరువాత ఆ స్థాయి హిట్ అందుకోలేదు. చివరగా మూడేళ్ల క్రితం రవితేజతో `అమర్‌ అక్బర్‌ ఆంటోనీ` చిత్రాన్ని రూపొందించిన శ్రీను వైట్ల…ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఢీ అంటే ఢీ చిత్రం చేస్తున్నారు.