ఒక స్టార్ హీరో సినిమా విడుదలవుతుందంటే.. ఫ్యాన్స్ షో అని, ప్రీమియర్స్ అని తెగ హడావిడి ఉంటుంది. అర్ధరాత్రి బెనిఫిట్ షోలు చూడడానికి థియేటర్ల వద్ద ఫ్యాన్స్ క్యూ కడుతుంటారు. కానీ ఈ హంగామాకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫుల్ స్టాప్ పెట్టేశాయి. కొంతకాలంగా స్పెషల్ షోలకు, బెనిఫిట్ షోలకు పర్మిషన్లు ఇవ్వడం లేదు. ఈ షోల కోసం టికెట్ రేట్లు పెంచుకొని అమ్ముకోవడాన్ని ఏపీ ప్రభుత్వం నిరాకరిస్తుంది. మరోపక్క శాంతి భద్రతల పేరుతో తెలంగాణ ప్రభుత్వం కూడా పర్మిషన్స్ ఇవ్వడం మానేసింది.
అయితే బాలయ్య నటించిన ‘అఖండ’ సినిమాతో మళ్లీ ఫ్యాన్స్ షో హడావిడి మొదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. బోయపాటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 1న అర్ధరాత్రి కచ్చితంగా ఫ్యాన్స్ షో వేయించాలని భావిస్తున్నారు. ఏపీ సంగతి ఎలా ఉన్నా.. హైదరాబాద్ లో మాత్రం బెనిఫిట్ షో ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు ఫ్యాన్స్.
‘అఖండ’ సినిమాతో మళ్లీ స్పెషల్ షోల హంగామా షురూ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఏరియాలో ఉన్న రెండు థియేటర్లను పర్మిషన్స్ తీసుకొని.. స్పెషల్ షో వేయాలని ప్లాన్ చేస్తున్నారు. గతంలో బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్, ‘పైసా వసూల్’ వంటి సినిమాలకు స్పెషల్ షోలు పడ్డారు. దీంతో ఈసారి కూడా బాలయ్య సినిమాకి స్పెషల్ షో ఉండాల్సిందేనని ఫిక్సయ్యారు.
స్పెషల్ షోలకు పర్మిషన్ దొరక్కపోతే.. ప్రీమియర్ పేరుతోనైనా.. అర్ధరాత్రి షో వేయించేలా ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య సినిమాకి గనుక పర్మిషన్స్ వస్తే.. ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి పెద్ద సినిమాలకి కూడా ఫ్యాన్స్ షో పర్మిషన్స్ దొరికే ఛాన్స్ ఉంది.