టాలీవుడ్లో ఇప్పుడంతా వారసుల హవానే నడుస్తోంది. సినీ కుటుంబాల్లో పుట్టి పెరిగిన కుర్రాళ్లు సినిమాలకు దూరంగా వెళ్లడం అరుదుగా జరుగుతోంది. చాలామంది హీరోలవ్వడానికే మొగ్గు చూపుతున్నారు. దగ్గుబాటి ఫ్యామిలీ విషయానికి వస్తే కొత్త తరంలో రానా ఇప్పటికే నటుడిగా మంచి స్థాయిని అందుకున్నాడు.
అతడి తమ్ముడు అభిరామ్ తెరంగేట్రం గురించి ఎప్పట్నుంచో చర్చ జరుగుతోంది. రామానాయుడు ఉండగానే అతణ్ని హీరోగా పరిచయం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ ఏవో కారణాలతో ఆ పని వాయిదా పడుతూ వస్తోంది. శనివారం రామానాయుడు జయంతి సందర్భంగా అభిరామ్ ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం తన తెరంగేట్రం గురించి మాట్లాడాడు.
తన తాత ఉండుంటే ఈపాటికి ఎప్పుడో తాను హీరోనయ్యేవాడినని అభిరామ్ అన్నాడు. తాను ముంబయిలో ఆరు నెలల పాటు నటనలో శిక్షణ తీసుకున్నానని.. సినిమాల్లోకి రావడానికి సర్వ సన్నద్ధంగా ఉన్నానని.. సాధ్యమైనంత వరకు ఓ కొత్త దర్శకుడితో తొలి సినిమా చేయాలనుకుంటున్నానని అభిరామ్ తెలిపాడు. తొలి సినిమాగా యాక్షన్ స్టోరీ లాంటిదేమీ కాకుండా మంచి ప్రేమకథ చేయాలనుకుంటున్నట్లు అతను చెప్పాడు.
ప్రస్తుతం తన అన్నయ్య రానా పెళ్లి పనుల్లో ఉన్నట్లు చెప్పిన అభిరామ్.. ఆగస్టు 8న పెళ్లి ఉంటుందని ధ్రువీకరించాడు. మొత్తానికి అభిరామ్ తెరంగేట్రం మీద ఇక సందేహాలేమీ పెట్టుకోవాల్సిన పనైతే లేదు. తన మాటల్ని బట్టి చూస్తే వచ్చే ఏడాది అతడి తొలి సినిమా ప్రారంభమయ్యే అవకాశముంది.