ఓటీటీ కథ కోసం నితిన్ వెయిటింగ్..!

లాక్ డౌన్ సమయంలో ఓటీటీ హవా బాగా పెరిగిపోయింది. ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఓటీటీలో దొరుకుతుంది. అందుకే ఇప్పుడు చాలా మంది నిర్మాతలు ఓటీటీ కోసం ప్రత్యేకంగా సినిమాలు చేస్తున్నారు. అతి తక్కువ సమయంలో సినిమాలను తీసి ఓటీటీలకు అమ్ముకుంటున్నారు. ఆ విధంగా భారీ లాభాలను పొందుతున్నారు. ఇప్పుడు హీరో నితిన్ కూడా అదే చేస్తున్నాడట. ఇటీవల నితిన్ నటించిన ‘మ్యాస్ట్రో’ సినిమా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో నటించడంతో పాటు తన సొంత బ్యానర్ లో నిర్మించాడు నితిన్. అందుకే థియేటర్లో సినిమా రిలీజ్ చేస్తే ఎలా ప్రమోషన్స్ చేస్తారో.. అదే రేంజ్ లో ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహించాడు. ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా.. నితిన్ కి మాత్రం భారీ లాభాలను తీసుకొచ్చింది. ఏకంగా పదిహేను కోట్ల టేబుల్ ప్రాఫిట్ తీసుకొచ్చింది. ఓటీటీకి సినిమా తీసి ఇవ్వడంలో ఇన్ని లాభాలు వస్తాయనే విషయాన్ని గ్రహించిన నితిన్ ఇప్పుడు ఓటీటీ కోసం మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

యంగ్ డైరెక్టర్లను ఓటీటీకి సరిపడా కథ ఏమైనా ఉంటే చెప్పమని అడుగుతున్నాడట. సింపుల్ కథను తీసుకొని.. తక్కువ బడ్జెట్ లో పూర్తి చేయాలని నితిన్ ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ హీరో ‘మాచర్ల నియోజకవర్గం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే ఓటీటీ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టాలని అనుకుంటున్నాడు. మరి నితిన్ కి సూటయ్యే కథ దొరుకుతుందేమో చూడాలి!