స‌ర్ప్రైజ్.. మోహ‌న్ లాల్ స‌ర‌స‌న మంచు ల‌క్ష్మి

మంచు మోహ‌న్ బాబు ఘ‌న వార‌స‌త్వంతో ఎన్నో ఆశ‌ల‌తో టాలీవుడ్లోకి అడుగు పెట్టారు ఆయ‌న పిల్ల‌లు. కానీ ఎవ్వ‌రూ అనుకున్నంత‌గా స‌క్సెస్ కాలేదు. మంచు విష్ణు, మంచు మ‌నోజ్‌ల మాదిరి కాకుండా కొంచెం లేటుగా అరంగేట్రం చేసిన మంచు ల‌క్ష్మి హీరోయిన్‌గా వెలిగిపోవాల‌నేమీ అనుకోలేదు. నెగెటివ్, క్యారెక్ట‌ర్ రోల్స్‌కైనా రెడీ అన్న‌ట్లుగా క‌నిపించింది. ఆమె అరంగేట్ర‌మే అన‌గ‌నగా ఓ ధీరుడు చిత్రంలో విల‌న్ పాత్ర‌తో జ‌రిగింది. ఆ త‌ర్వాత లీడ్, క్యారెక్ట‌ర్ రోల్స్ చేసింది. కానీ ఏవీ స‌రైన ఫ‌లితాన్నివ్వ‌లేదు. దీంతో కొన్నేళ్లుగా ల‌క్ష్మి న‌ట‌న‌కు దూరంగా ఉంది. ఆమె తీరు చూస్తే మ‌ళ్లీ సినిమాల్లో న‌టించేలాగే క‌నిపించ‌లేదు.

కానీ ఇప్పుడో స‌ర్ప్రైజ్ న్యూస్‌తో అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది మంచు వార‌మ్మాయి. ఆమెకు ఓ పెద్ద సినిమాలో హీరోయిన్‌గా అవ‌కాశం ద‌క్కింది. ఆ సినిమాలో హీరో మోహ‌న్ లాల్ కావ‌డం విశేషం.

60 ప్ల‌స్ వ‌య‌సులో విరామం లేకుండా విల‌క్ష‌ణ సినిమాల‌తో దూసుకెళ్తున్న మోహ‌న్ లాల్‌.. ఇటీవ‌లే మాన్‌స్ట‌ర్ అనే సినిమాను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందు లాలెట్ట‌న్‌తో పులి మురుగ‌న్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించిన వైశాఖ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ కాగా.. ఇందులో మోహ‌న్ లాల్ ల‌క్కీ సింగ్ అనే పోలీస్ అధికారి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఆయ‌న‌కు జోడీగా మంచు లక్ష్మి న‌టిస్తున్న‌ట్లుగా కొంద‌రు పీఆర్వోలు ట్వీట్లు వేశారు. ఇంకా ల‌క్ష్మి ఈ వార్త‌పై స్పందించ‌లేదు.

ట్విట్ట‌ర్లో వెరిఫైడ్ హ్యాండిల్స్ ఉన్న పేరున్న పీఆర్వోలే ఈ విష‌యాన్ని వెల్ల‌డించారంటే లాల్‌కు జోడీగా ల‌క్ష్మి ఖ‌రారైన‌ట్లే. ఇంత‌కుముందు మ‌ణిర‌త్నం సినిమా క‌డలిలో ల‌క్ష్మి ఓ పాత్ర చేసింది. కానీ ఆ పాత్ర అనుకున్నంత‌గా లేదు. అలా కాకుండా ఇప్పుడు ల‌క్ష్మికి లాల్ సినిమాలో కీల‌క పాత్రే ద‌క్కి ఉంటుంద‌ని, ఆమె కెరీర్ ఈ సినిమాతో మ‌లుపు తిరుగుతుంద‌ని ఆశిద్దాం.