రాధేశ్యామ్ కొత్త పోస్టర్‌తో సందేహాలు

వేరే సినిమాలు సెట్స్ మీదికి వెళ్లిన కొన్ని రోజుల నుంచే ఆ సినిమా నుంచి ఒక్కో పాట రిలీజ్ చేస్తూ ప్రమోషన్లు చేసుకుంటుంటే.. రెండేళ్ల ముందు పట్టాలెక్కిన ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’ నుంచి ఇప్పటిదాకా ఒక్క పాట కూడా రిలీజ్ కాకపోవడం పట్ల అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభాస్ చివరి సినిమా ‘సాహో’కు సంగీత దర్శకుల విషయంలో విపరీతమైన గందరగోళం నెలకొని రిలీజ్‌కు కొన్ని నెలల ముందు వేర్వేరు మ్యూజిక్ డైరెక్టర్లతో పాటలు చేయించుకుని హడావుడి పడటం వల్ల సినిమాకు నష్టం జరగడం తెలిసిందే.

‘రాధేశ్యామ్’ మ్యూజిక్ విషయంలోనూ ఇలాంటి గందరగోళమే నడిచింది. చివరికి సౌత్ వెర్షన్లకు ‘డియర్ కామ్రేడ్’ ఫేమ్ జస్టిన్ ప్రభాకరన్‌ను.. హిందీ వెర్షన్‌కు వేరే మ్యూజిక్ డైరెక్టర్‌ను ఖరారు చేశారు. బ్యాగ్రౌండ్ స్కోర్ బాధ్యతలేమో ఇంకొకరికి అప్పగించారు. ఐతే ఏ వెర్షన్‌కు సంబంధించి కూడా ఇప్పటిదాకా సాంగ్స్ అప్‌డేట్స్ మాత్రం లేవు.

విడుదలకు ఇంకో రెండు నెలల సమయమే ఉన్న నేపథ్యంలో ఇప్పుడైనా కదలరా అని అభిమానులు సోషల్ మీడియాలో గొడవ గొడవ చేస్తే ఎట్టకేలకు ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ నెల 15న ‘రాధేశ్యామ్’ నుంచి తొలి పాట విడుదల కాబోతోంది. ఐతే ఈ అప్‌డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ కొత్త సందేహాలకు తెరతీస్తోంది. ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ పోస్టర్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలు మాత్రమే పేర్కొన్నారు. హిందీ గురించి ప్రస్తావన లేదు.

ఇప్పుడు రిలీజ్ చేస్తున్న పాట దక్షిణాది భాషలకే పరిమితమా.. హిందీలో ఉండదా అన్న డౌట్ ముందు వస్తోంది. ఇలా పాటల విషయంలో తేడాలెలా ఉంటాయి అనిపిస్తోంది. ఐతే అదే సమయంలో ‘రాధేశ్యామ్’ హిందీ రిలీజ్ విషయంలో ఏమైనా సమస్యలున్నాయా.. సంక్రాంతికి దక్షిణాది భాషల్లో మాత్రమే సినిమాను రిలీజ్ చేస్తారా.. హిందీ వెర్షన్ ఏమైనా ఆలస్యమవుతుందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్న అభిమానులకు మేకర్స్ నుంచి త్వరగా క్లారిటీ వస్తే బెటర్.