‘జబర్దస్త్’ షోను వదిలేస్తున్నాడా..?

బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకుపోతుంది ‘జబర్దస్త్’. దీనికి పోటీగా ఎన్ని షోలు వస్తున్నా.. బీట్ చేయలేకపోతున్నాను. ఈ షో చాలా మంది కమెడియన్స్ కు లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. పదుల సంఖ్యలో కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కొంతమందికి సెలబ్రిటీ స్టేటస్ కూడా వచ్చింది. దాదాపు తొమ్మిదేళ్లుగా ఈ షో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. మునుపటితో పోలిస్తే.. ఈ మధ్యకాలంలో ‘జబర్దస్త్’ కామెడీ పెద్దగా పండడం లేదు. రొటీన్ స్కిట్ లతో బోర్ కొట్టిస్తున్నారు.

అయినప్పటికీ టీఆర్ఫీ తగ్గడం లేదు. అది వేరే విషయం. ఇప్పుడు ఈ షోకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ షోలో పాపులర్ కమెడియన్స్ లో సుడిగాలి సుధీర్ ఒకరు. కొన్ని కారణాల వలన ఆయన ఇప్పుడు ‘జబర్దస్త్’ షోని వదిలేయాలని నిర్ణయించుకున్నారట. సుధీర్ గనుక బయటకు వచ్చేస్తే అతడితో పాటు.. రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను కూడా ఈ షోని వదిలేద్దామని అనుకుంటున్నారట. వీళ్ల ముగ్గురూ ఒక టీమ్ అనే సంగతి తెలిసిందే. సుధీర్ కామెడీ, గెటప్ శ్రీను యాక్షన్, రామ్ ప్రసాద్ పంచ్ లతో వీళ్ల స్కిట్ లు షో మొత్తానికి హైలైట్ గా నిలుస్తుంటాయి.

అలాంటిది ఈ బ్యాచ్ గనుక బయటకు వచ్చేస్తే.. ఆ ఎఫెక్ట్ రేటింగ్స్ పై పడే ఛాన్స్ ఉంది. మల్లెమాల సంస్థ ప్రతి ఏడాది ‘జబర్దస్త్’ ఆర్టిస్ట్ లతో అగ్రిమెంట్స్ చేయించుకుంటూ ఉంటుంది. ఈసారి అగ్రిమెంట్ పై సైన్ చేయనని సుధీర్ చెప్పడంతో విషయం బయటకొచ్చింది. ప్రస్తుతం సుధీర్ హీరోగా కొన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి. అలానే కొన్ని షోలను కూడా హోస్ట్ చేస్తున్నాడు సుధీర్. ఈ క్రమంలో ‘జబర్దస్త్’ షోకి టైం కేటాయించలేక.. షో నుంచి తప్పుకుందామని అనుకుంటున్నాడు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి!