పుష్పక విమానం.. ఈ పేరు తలుచుకోగానే లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన క్లాసిక్ మూవీ కళ్ల ముందు కదలాడుతుంది. మాటల్లేకుండా అదిరిపోయే వినోదాన్ని అందించిన ఈ అద్భుత చిత్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి టైటిల్ తీసుకుని ఆనంద్ దేవరకొండ హీరోగా దామోదర అనే కొత్త దర్శకుడు ఒక కామెడీ మూవీ తీశాడు. ఈ చిత్రాన్ని ఆనంద్ అన్నయ్య విజయ్ దేవరకొండనే నిర్మించాడు.
ఐతే ఒకప్పటి క్లాసిక్స్ నుంచి టైటిల్స్ తీసుకుని.. ఆ స్థాయికి తగని సినిమాలు తీసి వాటి పేరు చెడగొడుతున్నారనే ఫీలింగ్ చాలామందిలో ఉంది. అసలు ఇలాంటి టైటిల్స్ వాడుకునేటపుడు పాత సినిమాల మేకర్స్‌ను అనుమతి అడిగేవాళ్లు ఎంతమంది అనే చర్చ కూడా నడుస్తుంటుంది ఆయా సందర్భాల్లో.
ఐతే తాము మాత్రం ‘పుష్పక విమానం’ టైటిల్ విషయంలో సింగీతం శ్రీనివాసరావు అనుమతి కోరినట్లుగా ఆనంద్ దేవరకొండ తెలిపాడు. ఊరికే పాత టైటిల్ తీసుకోలేదని, సినిమా కథకు యాప్ట్‌గా ఉంటుందనే ఈ పేరు పెట్టామని.. ఆ టైటిల్ అనుకున్నాక అనుమతి కోసం సింగీతం శ్రీనివాసరావుకు ఫోన్ చేయగా.. తన అనుమతి అవసరం లేదని ఆయన చెప్పినట్లు ఆనంద్ వెల్లడించాడు. అదేమీ తాను సృష్టించిన పేరు కాదని.. మన ఇతిహాసాల్లోనే ఉందని.. కాబట్టి ఎవ్వరైనా ఆ టైటిల్ వాడుకోవచ్చని సింగీతం చెప్పినట్లు ఆనంద్ తెలిపాడు.
ఇక ‘పుష్పక విమానం’ సినిమాలో తాను నటించడం యాదృచ్ఛికంగా జరిగిందని.. నిజానికి తమ నిర్మాణ సంస్థలో వేరే హీరోతో ఈ సినిమా చేయాలనుకున్నామని అతను చెప్పాడు. ఐతే హీరో పెళ్లవగానే పెళ్లాం లేచిపోవడమా అంటూ చాలామంది హీరోలు ఈ కథలో నటించడానికి భయపడ్డారని.. చివరికి తానే ఆ పాత్ర చేయడానికి ముందుకు వచ్చానని.. ఇలాంటి కథల్లో నటించకపోతే కొత్త కథలు ఎలా వస్తాయని ఆనంద్ అన్నాడు.