బాలీవుడ్‌కు ప్రాణం పోస్తున్న సూర్యుడు

బాలీవుడ్ బాక్సాఫీస్‌ దాదాపు 20 నెలల నుంచి వెలవెలబోతోంది. 2020 మార్చిలో కరోనా కారణంగా థియేటర్లు మూతపడ్డాక.. బాలీవుడ్ సంక్షోభంలో పడిపోయింది. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గి గత ఏడాది చివర్లో థియేటర్లు పున:ప్రారంభం అయ్యాక వేరే ఇండస్ట్రీలు కొంచెం కోలుకున్నాయి కానీ.. బాలీవుడ్ పరిస్థితి మాత్రం మారలేదు.

సెకండ్ వేవ్‌కు ముందు ఏవో కొన్ని సినిమాలు నామమాత్రంగా రిలీజయ్యాయి కానీ.. ఏవీ అక్కడి బాక్సాఫీస్‌లో సందడి తేలేకపోయాయి. సెకండ్ వేవ్ తర్వాత కూడా బాలీవుడ్‌కు నిరాశ తప్పలేదు. హిందీ సినీ పరిశ్రమకు కేంద్ర స్థానం అనదగ్గ మహారాష్ట్రలో థియేటర్లు మూతబడే ఉండటం.. నార్త్ ఇండియాలో కొన్ని చోట్ల కూడా థియేటర్లు తెరవకపోవడం.. హిందీ ఆడియన్స్ థియేటర్లకు రావడానికి జంకడంతో గత రెండు నెలల్లో రిలీజైన సినిమాలేవీ ప్రభావం చూపలేకపోయాయి.

అక్షయ్ కుమార్ మూవీ ‘బెల్ బాటమ్’కు దారుణమైన ఫలితం రావడం బాలీవుడ్ ఫిలిం మేకర్స్‌ను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. ఐతే అక్టోబరు 23న మహారాష్ట్రలో థియేటర్లు తెరుచుకోవడం.. నార్త్‌లో అంతటా పరిస్థితులు మారడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. రెండు వారాలు గ్యాప్ ఇచ్చి దీపావళికి బాక్సాఫీస్ రీస్టార్ట్‌కు ఏర్పాట్లు చేశారు. అక్షయ్ కుమార్ భారీ చిత్రం, ఏడాదిన్నరగా రిలీజ్ కోసం చూస్తున్న ‘సూర్యవంశీ’ని దీపావళి కానుకగా భారీ ఎత్తున విడుదల చేశారు. రిలీజ్ ప్లానింగ్ బాగా చేయడం, ప్రమోషన్లు కూడా హోరెత్తించడంతో ఈ సినిమా మంచి ఫలితాన్నే అందుకునేట్లు కనిపిస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం కూడా కలిసొచ్చింది.

తొలి రోజు ఈ చిత్రం ఇండియాలో రూ.23 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. ‘బెల్ బాటమ్’ ఫుల్ రన్లో దాదాపు ఇంతే వసూళ్లు రాబట్టడం గమనార్హం. ‘సూర్యవంశీ’కి టైమింగ్ బాగా కలిసొచ్చిందన్నది స్పష్టం. రెండో రోజు కూడా ఈ సినిమా హౌస్ ఫుల్ వసూళ్లతో నడుస్తున్నట్లు ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. వీకెండ్ అయ్యేసరికి ఇండియాలో రూ.60-70 కోట్ల మధ్య గ్రాస్ రావచ్చు. ఓవరాల్ కలెక్షన్లు రూ.100 కోట్లకు అటు ఇటుగా ఉండొచ్చు. మొత్తానికి బాలీవుడ్ ఈ సినిమాతో బలంగానే పుంజుకున్నట్లు కనిపిస్తోంది. ఇక హిందీ సినిమాలు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోవచ్చు.