కొంతమంది మరణించిన తర్వాతే వాళ్లెంత మంచి వారనే విషయం ప్రపంచానికి తెలుస్తుంటుంది. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. అతను ఒక్కడే 26 ఆనాధ ఆశ్రమాలు.. 48 పాఠశాలలు.. 16 వృద్ధాశ్రమాలు.. 19 గోశాలలు నడుపుతున్నాడని.. 1800 మంది పిల్లల్ని దత్తత తీసుకుని వారి బాధ్యతలు చూస్తున్నాడని.. మైసూర్లో శక్తి ధామ్ పేరిట ఆడపిల్లలకు శిక్షణ ఇచ్చే సంస్థను నడుపుతున్నాడని తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారిప్పుడు.
ఈ మెసేజ్ అతను మరణించిన రోజు నుంచి సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతోంది. అదే సమయంలో తన మరణానంతరం కళ్లు దానమివ్వాలని ముందే డిక్లరేషన్ ఇవ్వడంతో.. చనిపోయిన కొన్ని గంటల్లోనే పునీత్ కళ్లను తీసి ఒక పెట్టెలో తీసుకెళ్తున్న దృశ్యం కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
పునీల్ కళ్లు ఏకంగా నలుగురికి చూపునివ్వడం విశేషం. అతడి కళ్లను ఈ విషయాన్ని బెంగళూరులోని నారాయణ నేత్రాలయ ఆసుపత్రి వైద్యులు ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడించడం గమనార్హం. సాధారణంగా చనిపోయిన వ్యక్తుల నుంచి సేకరించిన కళ్ళను ఇతరులకి ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. ఒక వ్యక్తి కళ్ళతో ఇద్దరికీ మాత్రమే చూపు దక్కుతుంది. కానీ పునీత్ కళ్ళలోని కార్నియాలను వేరు చేసి అంధులైన నలుగురికి శస్త్రచికిత్స చేశారు వైద్యులు. అవి విజయవంతమై ఆ నలుగురికీ చూపు వచ్చింది.
అధునాతన సాంకేతికతతో ఈ మార్పిడి చేశామని నారాయణ నేత్రాలయ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భుజంగ్ శెట్టి వెల్లడించారు. పునీత్ కళ్లతో చూపు దక్కించుకున్నవారిలో ఒక మహిళ మరియు ముగ్గురు పురుషులు ఉన్నారు. వీళ్లందరూ కర్ణాటకకి చెందినవారే. పునీత్ తండ్రి రాజ్‌కుమార్, తల్లి పార్వతమ్మ కూడా మరణానంతరం వారి కళ్లను దానం చేశారు. వారిని పునీత్ అనుసరించి నలుగురు అంధుల జీవితాల్లో వెలుగులు నింపాడు.