నాగశౌర్య ఫాంహౌస్ లో పేకాట.. భారీగా నగదు స్వాధీనం

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య అద్దెకు తీసుకున్న ఫాంహౌస్ లో భారీ ఎత్తున పేకాట ఆడుతున్న వైనాన్ని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు బయటపెట్టారు. మాదాపూర్ ఎస్ వోటీ పోలీసులు ఆకస్మిక దాడి చేసి.. పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నట్లుగా చెబుతున్నారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచిరేవుల ప్రాంతంలో గ్రీన్ ల్యాండ్స్ కాలనీలోని ఒక ఇండిపెండెంట్ హౌస్ లో పేకాటను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని అందుకున్న పోలీసులు దాడి చేశారు.

ఈ సందర్భంగా రూ.6.77లక్షల నగదును.. 33 మొబైల్ ఫోన్లు.. 29 పేకాట సెట్లతో పాటు రెండు కాసినో కాయిన్లు.. మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. రిటైర్డు ఐఏఎస్ అధికారికి చెందిన ఒక ఇంటిని నాగశౌర్య కొద్దికాలం క్రితం అద్దెకు తీసుకున్నారు. ఈ కాలనీలోని చాలా ఇళ్లను సినీ రంగానికి చెందిన పలువురు అద్దెకు తీసుకోవటం.. సీరియల్స్.. సినిమా నిర్మాణం కోసం వినియోగిస్తుంటారు.

హీరో నాగశౌర్య ఇంటిని అద్దెకు తీసుకున్నప్పటికి.. దాన్ని గుట్ట సమన్ కుమార్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఈ పేకాట కార్యక్రమం జోరుగా సాగుతున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఇంటిని ఎవరు అద్దెకు తీసుకున్నారన్న అంశం మీద మాత్రం పోలీసులు సరైన సమాచారం ఇవ్వటం లేదు. ప్రస్తుతం ఈ ఉదంతంపై విచారణ చేస్తామని.. తమ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని మాత్రం వారు చెబుతున్నారు.

ఈ ఉదంతం టాలీవుడ్ లో కలకలాన్ని రేపింది. పేకాట మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత ఆగ్రహంగా ఉంటారో తెలిసిందే. అయినప్పటికీ ఇలాంటి పనులు చేయటం హాట్ టాపిక్ గా మారింది.