పునీత్ చ‌దివిస్తున్న పిల్ల‌ల్ని చూసుకుంటా-విశాల్

పునీత్ రాజ్ కుమార్ ఎంత మంచివాడు, గొప్ప‌వాడు అన్న‌ది అత‌డి మ‌ర‌ణానంత‌రం ఎక్కువ‌మందికి తెలుస్తోంది. అత‌ను 26 ఆనాధ ఆశ్రమాలు.. 48 పాఠశాలలు.. 16 వృద్ధాశ్రమాలు.. 19 గోశాలలు న‌డుపుతున్నాడ‌ని.. 1800 మంది పిల్లల్ని దత్తత తీసుకుని వారి బాధ్య‌త‌లు చూస్తున్నాడ‌ని.. మైసూర్లో శక్తి ధామ్ పేరిట ఆడపిల్లలకు శిక్షణ ఇచ్చే సంస్థ‌ను న‌డుపుతున్నాడ‌ని.. తెలిసి అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఒక వ్య‌క్తి ఇంత పెద్ద స్థాయిలో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నాడా అని అబ్బుర‌ప‌డుతున్నారు.

ఐతే పునీత్ మ‌ర‌ణంతో వాళ్లంద‌రి భ‌విత‌వ్యం ఏమ‌వుతుందో అన్న ఆందోళ‌నా నెల‌కొంది. అయితే త‌మిళ హీరో విశాల్.. పునీత్ ద్వారా సాయం పొందుతున్న 1800 మంది పిల్ల‌ల చ‌దువుకు త‌న వంతుగా సాయం చేస్తాన‌ని హామీ ఇచ్చాడు. త‌న కొత్త చిత్రం ఎనిమీ తెలుగు వెర్ష‌న్ ప్రి రిలీజ్ ఈవెంట్లో అత‌నీమేర‌కు ప్ర‌క‌ట‌న చేశాడు.

పునీత్ గురించి అంద‌రూ బాధ‌ప‌డుతున్న టైంలో ఎనిమీ ఈవెంట్ చేయ‌డం ఇబ్బందిగానే ఉందంటూ త‌న ప్ర‌సంగాన్ని మొద‌లుపెట్టిన విశాల్.. పునీత్ లేడ‌నే విష‌యం ఇంకా ఏదో క‌ల‌లాగే ఉంద‌ని.. ఆ విష‌యాన్ని న‌మ్మ‌డానికి మ‌న‌సు అంగీక‌రించ‌డం లేద‌ని చెప్పాడు. అత‌డి మ‌ర‌ణం కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు, సినీ ప‌రిశ్ర‌మ‌కే కాక‌.. స‌మాజానికి కూడా పెద్ద లోట‌ని అత‌న‌న్నాడు. సినిమా ప‌రిశ్ర‌మ‌లో అంత ఒదిగి ఉండే వ్య‌క్తి మరొక‌రిని చూడ‌లేద‌ని.. ఇంట్లో అయినా బ‌య‌ట అయినా.. మేక‌ప్ వేస్కున్నా.. వేసుకోకున్నా.. పునీత్ ఒకేలా.. ఎంతో ఒదిగి ఉంటాడ‌ని విశాల్ చెప్పాడు.

పునీత్ చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాల గురించి తెలిసి ఒక వ్య‌క్తి ఇంత చేయ‌గ‌ల‌డా అని ఆశ్చ‌ర్య‌పోయాన‌ని.. పునీత్ స్నేహితుడిగా అత‌డి అండ‌తో చ‌దువుత‌కుంటున్న‌ 1800 మంది పిల్ల‌ల‌కు త‌న స‌పోర్ట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని.. వ‌చ్చే ఏడాది ఆ ఫౌండేష‌న్‌కు వెళ్లి వారి కోసం తాను ఏం చేయ‌గ‌ల‌నో అంతా చేస్తాన‌ని విశాల్ హామీ ఇచ్చాడు.