ఈ ఏడాది మలయాళం నుంచి వచ్చిన గొప్ప చిత్రాల్లో ‘నాయట్టు’ ఒకటి. రాజకీయ నాయకులు.. ప్రభుత్వాధినేతలు ప్రజల మధ్య కులం కుంపట్లు పెట్టి.. వ్యవస్థలను తమ స్వార్థం కోసం ఎలా ఉపయోగించుకుంటారో.. అత్యవసర పరిస్థితులు తలెత్తినపుడు ప్రభుత్వం కోసం పని చేసేవాళ్లు ఎలా బలిపశువులు అయిపోతారో ఈ సినిమాలో చాలా ఎఫెక్టివ్‌గా చూపించారు.
కొవిడ్ నేపథ్యంలో ఈ హార్డ్ హిట్టింగ్ మూవీ నెట్ ఫ్లిక్స్ ద్వారా రిలీజై మలయాళీలనే కాక వివిధ భాషల వాళ్లను అమితంగా ఆకట్టుకుంది. మార్టిన్ ప్రకాట్ రూపొందించిన ఈ చిత్రంలో కుంచుకో బోబన్, నిమిష, జార్జ్ జోసెఫ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో వాళ్లు పోలీసు పాత్రలు చేశారు. సినిమా ఆ ముగ్గురి చుట్టూనే తిరుగుతుంది. కథాబలానికి తోడు కథనంలో ఉత్కంఠ.. ఈ ముగ్గురి అద్భుతమైన నటన.. దర్శకుడి ప్రతిభ తోడై సినిమా క్లాసిక్ స్టేటస్ తెచ్చుకుంది.
‘నాయట్టు’ రిలీజై కొన్ని రోజులకే తెలుగు రీమేక్ హక్కులు అమ్ముడైపోయాయి. అల్లు అరవింద్ వారి జీఏ2 పిక్చర్స్ దీని హక్కులను సొంతం చేసుకుంది. తెలుగు వెర్షన్ కోసం స్క్రిప్ట్ వర్క్, ప్రి ప్రొడక్షన్, కాస్ట్ అండ్ క్రూ ఎంపిక అన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడీ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించి షూట్‌కు రెడీ అయిపోయారు. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ చిత్రాల దర్శకుడు కరుణ కుమార్ ‘నాయట్టు’ తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నాడు.
బన్నీ వాసు, దివ్య మాధురి కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. తమిళంలో జార్జ్ జోసెఫ్ చేసిన కీలక పాత్రను ఇక్కడ రావు రమేష్ చేయబోతున్నారు. ఆయన కెరీర్లో ఈ పాత్ర ఒక మైలురాయిలా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఒరిజినల్లో కుంచుకో చేసిన పాత్రను ప్రియదర్శి, నిమిష కనిపించిన క్యారెక్టర్లో అంజలి కనిపించనున్నారు. సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ మ్యూజిక్ అందించబోతున్నాడు. తక్కువ బడ్జెట్లో శరవేగంగా ఈ సినిమాను పూర్తి చేయడానికి టీం రెడీ అయింది.