‘రొమాంటిక్’లో రామ్ మాస్ స్టెప్పులు!

ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి రానంత బజ్ ‘రొమాంటిక్’ సినిమాకి వచ్చింది. దానికి కారణం సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలనే చెప్పాలి. ఈ సినిమాకి ఒకదాని తరువాత మరొక ఎట్రాక్షన్ యాడ్ అవుతూనే ఉంది. పూరి స్వయంగా ఈ సినిమాకి కథ-మాటలు-స్క్రీన్ ప్లే అందించారు. రమ్యకృష్ణ సినిమాలో పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించబోతుంది. ముందుగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను వరంగల్ లో నిర్వహించి.. దానికి ముఖ్య అతిథిగా టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండను తీసుకొచ్చారు.

ఓ ఇంటర్వ్యూ కోసం ఏకంగా ప్రభాస్ ను రంగంలోకి దింపారు. హీరో ఆకాష్ పూరి, కేతికా శర్మలను ప్రభాస్ ఇంటర్వ్యూ చేయడం విశేషం. ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఈ ఒక్క వీడియోకి మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి. ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్ వచ్చి ఈ సినిమాకి ప్రమోషన్స్ చేశారంటే మామూలు విషయం కాదు. విజయ్ దేవరకొండ, ప్రభాస్ లను ప్రమోషన్స్ కోసం వాడుకుంటే.. హీరో రామ్ ని గెస్ట్ అప్పియరెన్స్ కోసం వాడేశారని తెలుస్తోంది.

రామ్ కెరీర్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి మాస్ హిట్టునిచ్చారు పూరి జగన్నాథ్. ఆ అనుబంధంతోనే ‘రొమాంటిక్’ సినిమాలో గెస్ట్ గా కనిపించడానికి ఒప్పుకున్నాడు రామ్. సినిమాలో ‘పీనే కే బాద్’ అనే సాంగ్ ఒకటి ఉంది. ఇప్పటికే లిరికల్ సాంగ్ బయటకు వచ్చింది. దీనికి పూరి, భాస్కర్ భట్ల కలిసి లిరిక్స్ రాశారు. ఈ పాటలోనే హీరో రామ్ కనిపిస్తాడట. కనిపించడమే కాదు.. మాస్ స్టెప్స్ కూడా వేస్తాడని తెలుస్తోంది. ఇది సినిమాకి మరో ఎట్రాక్షన్ అనే చెప్పాలి. శుక్రవారం నాడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.