సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ, టీవీ, రంగస్థల నటుడు రాజబాబు కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.
తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రపురం మండలం నరసాపేట రాజబాబు స్వస్థలం. నటనంటే ఎంతో ఇష్టం కావడంతో చిన్నప్పటిన ఉంచే నాటకాల్లో నటించారు రాజబాబు. ‘ఊరికి మొనగాడు’ చిత్రంతో సినిమాల్లోకి ప్రవేశించారు. ‘సింధూరం’ సినిమా తర్వాత నటుడిగా బాగా బిజీ అయ్యారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మళ్లీ రావా, భరత్ అను నేను, శ్రీకారం వంటి ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలు పోషించారు.
టెలివిజన్ రంగంలోనూ రాజబాబుకి మంచి పేరుంది. చిలసౌ స్రవంతి, అభిషేకం, రాధ–మధు, వసంత కోకిల, మనసు మమత, బంగారు పంజరం వంటి సూపర్ హిట్ సీరియల్స్‌లో నటించారు. 2005లో ‘అమ్మ’ సీరియల్‌లోని పాత్రకు నంది అవార్డు కూడా అందుకున్నారు. ఇండస్ట్రీలో అందరితో మంచిగా ఉంటారని, నవ్విస్తూ ఉంటారని రాజబాబుకు పేరు. అందుకే ఆందరూ ఆప్యాయంగా బాబాయ్ అని పిలుస్తుంటారు. ఆయన మృతి సినీ, టీవీ, రంగస్థల పరిశ్రమలకు తీరని లోటంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates