జగపతిబాబు బాలీవుడ్ డెబ్యూ!

ప్రముఖ టాలీవుడ్ నటుడు జగపతిబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా సినిమాలు చేయడం మొదలుపెట్టాక చాలా బిజీ అయిపోయారు. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ సినిమాల్లో కూడా ఆయనకు అవకాశాలు వస్తున్నాయి. సౌత్ లో ఆయన చాలా బిజీ యాక్టర్. అంతేకాదు.. అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల్లో ఆయన ముందు జాబితాలో ఉంటారు. ఇప్పుడు జగ్గూభాయ్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం.

ప్రముఖ దర్శకుడు అశుతోష్ గోవారికర్ రూపొందించనున్న ఓ సినిమాలో జగపతిబాబుని ఎన్నుకున్నట్లు సమాచారం. కొన్నేళ్లుగా అశుతోష్ గోవారికర్ తెరకెక్కిస్తోన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘మొహంజొదారో’, ‘పానిపట్’ లాంటి సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు అడ్వెంచరస్ కథను సిద్ధం చేసుకున్నారు. ఇందులో ఫర్హాన్ అక్తర్ ను హీరోగా ఎంపిక చేసుకున్నారు.

కథ ప్రకారం.. సినిమాలో ఫర్హాన్ అక్తర్ ఫారెస్ట్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇక విలన్ పాత్రలో జగపతిబాబుని తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. రీసెంట్ గానే జగపతిబాబు కూడా ఈ సినిమా అగ్రిమెంట్ పై సైన్ చేశారని టాక్. మొత్తానికి జగ్గూభాయ్ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. ఇందులో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని ఫారెన్ లొకేషన్స్ లో చిత్రీకరిస్తారట.