కమల్ హాసన్ యాపారం

లోకనాయకుడు కమల్ హాసన్ లేటు వయసులో ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఒకప్పుడు తనకు రాజకీయాలు అస్సలు పడవన్న ఆయనే.. తర్వాత పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేశాడు. ఆ సమయంలో సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న కమల్.. ‘బిగ్ బాస్’ రియాలిటీ షోను హోస్ట్ చేయడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ షోను ఐదో సీజన్లోనూ విజయవంతంగా నడిపిస్తున్నాడు కమల్. రాజకీయాల్లో ఎదురు దెబ్బలు తగలడంతో ఆయన తిరిగి సినిమాల్లో బిజీ అయ్యే ప్రయత్నంలో ఉన్నాడు.

‘మాస్టర్’ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్ హీరోగా ‘విక్రమ్’ అనే సినిమా తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత మధ్యలో ఆగిన ‘ఇండియన్-2’ చిత్రాన్ని పున:ప్రారంభించడానికి కమల్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. 66 ఏళ్ల వయసులో కమల్ ఒక వ్యాపారంలోకి అడుగు పెడుతుండటం విశేషం.

కమల్ త్వరలోనే ఫ్యాషన్ బిజినెస్‌లోకి అడుగు పెడుతున్నాడు. ఇందులో ఒక మంచి ప్రయోజనం ముడి పడి ఉంది. గొప్ప నైపుణ్యం ఉన్నప్పటికీ ఆర్థికంగా బలపడలేకపోతున్న చేనేత కార్మికులకు అండగా నిలిచే ప్రయత్నంలో భాగంగా కమల్ ఈ వ్యాపారం మొదలుపెడుతున్నాడు. ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ పేరుతో కమల్ కొత్త బ్రాండును పరిచయం చేయబోతున్నాడు. చేత్తో నేసిన బట్టలు, ఇతర వస్తువులను ఆ బ్రాండ్ నేమ్‌తో అందించనున్నాడు కమల్.

విశేషం ఏంటంటే.. ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ తొలి స్టార్ ఆరంభం కాబోయేది ఇండియాలో కాదు.. అమెరికాలో. ఆ దేశంలోని చికాగోలో త్వరలోనే ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ తొలి దుకాణాన్ని కమల్ ప్రారంభించబోతున్నాడట. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అమృత రామ్ డిజైన్లతో తొలి స్టార్ ఆరంభం కానుంది. ఖాదికి మన దేశ చరిత్రలో ప్రత్యేక అధ్యాయం ఉందని, అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండేలా అందమైన దుస్తులను అందించబోతున్నామని, ఖాదీని నగర యువతకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ బ్రాండ్ మొదలుపెడుతున్నామని కమల్ ప్రకటించాడు. త్వరలో భారత్‌లోనూ ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ స్టోర్లు తెరవడానికి కమల్ ప్రణాళికలు సిద్ధం చేశాడు.