అవును.. అఖిల్ సినిమాలో ఆ లెజెండ్

అక్కినేని అఖిల్ ఎన్నాళ్లో వేచి చూస్తున్న విజ‌యం ద‌క్కిన‌ట్లే క‌నిపిస్తోంది. ద‌స‌రా కానుక‌గా రిలీజైన అత‌డి కొత్త చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ పండుగ సెల‌వుల‌ను బాగానే ఉప‌యోగించుకుంది. కొంచెం డివైడ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ త‌ట్టుకుని మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది.

దాదాపుగా వీకెండ్ క‌లెక్ష‌న్ల‌తోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు వ‌చ్చేసిన‌ట్లు భావిస్తున్నారు. కాబ‌ట్టి అఖిల్ కెరీర్లో తొలి విజ‌యం జ‌మ అయిన‌ట్లే. దీంతో ఎంతో ఉత్సాహంగా త‌న త‌ర్వాతి చిత్రం మీదికి వెళ్లిపోనున్నాడు అక్కినేని కుర్రాడు. ఆ సినిమా అఖిల్ కెరీర్లోనే ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కం. సురేంద‌ర్ రెడ్డి లాంటి టాప్ డైరెక్ట‌ర్, అనిల్ సుంక‌ర లాంటి అగ్ర నిర్మాత క‌లిసి భారీ బ‌డ్జెట్లో చేస్తున్న ఈ చిత్రంతో అఖిల్ కెరీర్ మ‌రో స్థాయికి వెళ్తుంద‌న్న అంచ‌నాతో అక్కినేని అభిమానులు ఉన్నారు.

ఈ సినిమాలో హీరోకు స‌మాన‌మైన ఓ కీల‌క పాత్ర ఉండ‌గా.. దాని కోసం ఓ అగ్ర న‌టుడిని ఎంపిక చేసే ప్ర‌య‌త్నంలో ఉంది చిత్ర బృందం. ముందు దానికి మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ పేరు వినిపించింది. కానీ ఆయ‌నీ ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించారు. త‌ర్వాత మ‌ల‌యాళంకే చెందిన మ‌రో సూప‌ర్ స్టార్ మమ్ముట్టిని అడిగారు.

కానీ ఆయ‌నేమ‌న్నార‌న్న‌ది స్ప‌ష్ట‌త లేక‌పోయింది. ఐతే ఎట్ట‌కేల‌కు మ‌మ్ముట్టి ఈ సినిమాకు ప‌చ్చ జెండా ఊపారు. ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ తమిళ పీఆర్వో శ్రీధ‌ర్ పిళ్లై త‌న ట్విట్ట‌ర్ అకౌంట్లో వెల్ల‌డించారు. ఇందులో మ‌మ్ముట్టి చేయ‌బోయేది ఆర్మీ ఆఫీస‌ర్ పాత్ర అని కూడా ఆయ‌న వెల్ల‌డించారు. బ‌హుశా మ‌మ్ముట్టి ఆధ్వ‌ర్యంలో సీక్రెట్ ఆప‌రేష‌న్ల‌లో పాల్గొనే ఏజెంట్ పాత్ర‌లో అఖిల్ క‌నిపించే అవ‌కాశ‌ముంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం త్వ‌ర‌లోనే అఖిల్, మ‌మ్ముట్టి యూర‌ప్‌కు వెళ్ల‌నున్నార‌ట‌.