ఇలాంటి టాక్‌తో హౌస్ ఫుల్స్ ఏంట‌బ్బా..

దసరా సందర్భంగా తెలుగులో మూడు కొత్త చిత్రాలు ప్రేక్షకులను పలకరించాయి. విడుదలకు ముందు వీటిలో ఎక్కువ అంచనాలున్నది ‘మహాసముద్రం’ మీదే. ముందుగా దసరా రేసులోకి వచ్చింది ఆ చిత్రమే. దసరా టైంలో ముందుగా ప్రేక్షకులను పలకరించింది ఆ చిత్రమే. కానీ అంచనాలను అందుకోవడంలో ‘మహాసముద్రం’ పూర్తిగా విఫలమైంది. దీనికి ప్రేక్షకుల నుంచి తిరస్కారం తప్పలేదు.

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’కు డివైడ్ టాకే వచ్చినా.. మరీ తీసిపడేయదగ్గ సినిమా కాదు. ఓ మోస్తరు ఎంటర్టైన్మెంట్ ఉండటం.. పూజా హెగ్డే, మ్యూజిక్ పెద్ద ప్లస్ కావడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ లీడర్‌గా నిలిచింది. ఇక దసరా బరిలో ఉన్న చివరి చిత్రం ‘పెళ్ళి సందడి’ గురించి రిలీజ్ ముంగిట ఎవరూ పట్టించుకోలేదు. ఈ సినిమా ట్రైలర్ చూసి ఇది మూడు దశాబ్దాల ముందు రావాల్సిన సినిమా అంటూ కౌంటర్లు వేశారు చాలామంది.

ఇక ‘పెళ్ళిసందడి’కి వచ్చిన రివ్యూల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. విమర్శకులందరూ ఈ సినిమాను ఏకిపడేశారు. సినిమా చూసిన వాళ్లకు ఆ విమర్శలు తప్పుగా ఏమీ అనిపించలేదు. సోషల్ మీడియా టాక్ కూడా ఏమీ బాగా లేదు. కానీ ఇలాంటి టాక్ తెచ్చుకున్న సినిమాకు తొలి మూడు రోజుల్లో హౌస్ ఫుల్స్ పడ్డాయంటే ఆశ్చర్యపోవాల్సిందే.

రిలీజ్ రోజు ఉదయం కొన్ని షోలు ఫుల్ కావడంలో ఆశ్చర్యం లేదు. కానీ చాలా బ్యాడ్ టాక్ తెచ్చుకున్నాక కూడా సాయంత్రం ‘పెళ్ళిసందడి’కి టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. శని, ఆదివారాల్లో కూడా ఫస్ట్ షోలకు చాలా చోట్ల హాళ్లు నిండిపోయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇంత పేలవమైన సినిమాకు ఈ వసూళ్లేంటి అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఐతే సంక్రాంతి, దసరా సెలవుల్లో కలిసొచ్చే అంశం ఇదే. ఈ టైంలో ప్రతి కుటుంబం థియేటరుకెళ్లి సినిమా చూడాలనుకుంటుంది. ఆ టైంలో ఏ సినిమా అందుబాటులో ఉంటే దానికి వెళ్తారు. ఫస్ట్ ఛాయిస్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కాగా.. దానికి టికెట్లు దొరక్కుంటే నెక్స్ట్ ఛాయిస్ ‘పెళ్ళిసందడి’నే అవుతోంది.

ఇందులో పాటలు బాగున్నాయి, హీరో హీరోయిన్లు బాగున్నారన్న టాక్ రావడంతో.. సీరియస్ మూవీ అయిన ‘మహాసముద్రం’ ఏం చూస్తాంలే అని దీన్నే ప్రిఫర్ చేసినట్లున్నారు ప్రేక్షకులు. ఆ క్రమంలోనే ‘పెళ్ళిసందడి’కి ఫుల్స్ పడ్డాయని అంచనా వేస్తున్నారు. మరి సోమవారం కూడా ఈ సినిమా ప్రేక్షకులను ఆకర్షించిందంటే మాత్రం ఇదొక మ్యాజిక్‌గానే భావించాలి.