దేవుడు అన్న టాపిక్ ఈమధ్య సినిమాలో కనిపించడం బాగా తగ్గిపోయింది. ఇది వరకు.. సెపరేట్ గా ఓ జోనర్ ఉండేది. అలాంటి కథల్ని కోడి రామకృష్ణ లాంటి దర్శకులు బాగా చెప్పేవారు. గ్రాఫిక్స్‌ని వాడుకుంటూ బాగా చూపించేవారు. రాఘవేంద్రరావు కూడా.. కొన్నాళ్లు ఆధ్యాత్మిక చింతనతో సినిమాలు తీశారు. కానీ.. ఆ మహిమలు తెరపై కనిపించడం లేదు.
తాజాగా ప్రభాస్ సినిమాలో కాస్త దైవత్వ లక్షణాలు కనిపించనున్నాయని టాక్. ప్రభాస్ – నాగ అశ్విన్ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇది సోషియో ఫాంటసీ అనీ, సైన్స్ ఫిక్షన్ అని, జానపదం అని రకరకాల కథనాలు.
అయితే.. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగుతుందన్న విషయం రూఢీ అయిపోయింది. దాంతో పాటు కాస్త ఆధ్యాత్మిక భావాలూ ఉంటాయట. దేవుడి మహిమలకు సంబంధించిన ఓ అంశం ఈ సినిమాలో ఉందని, అయితే దాన్ని అంతర్లీనంగా టచ్ చేశారని సమాచారం.
ఒకటి మాత్రం నిజం. ఇప్పటి వరకూ వచ్చిన సినిమాల్లా ఉండదీ సినిమా. అన్ని రకాల జోనర్లూ కాస్త కాస్త కనిపిస్తాయి. మరి ఇలాంటి సినిమాని ఏ జోనర్ కిందకు తీసుకొస్తారో.???