చిరంజీవిపై మోహన్ బాబు కౌంటర్లు

మెగాస్టార్ చిరంజీవి మీద మోహన్ బాబు మరోసారి పరోక్షంగా కౌంటర్లు వేశారు. శనివారం ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు కూడా హాజరయ్యారు. ఈ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. ‘పెళ్ళిసంద-డి’ వేడుకలో చిరంజీవి చేసిన వ్యాఖ్యల మీద పరోక్షంగా పంచులు వేశారు.

కొందరు రెండేళ్ల పదవి.. చిన్న పదవి అంటూ ‘మా’ అధ్యక్ష పదవిని తక్కువ చేసేలా మాట్లాడుతున్నారని.. కానీ రెండేళ్ల పదవే అయినా ఎంతో బాధ్యతతో చేసే పని ఇదని.. ఆ కుర్చీకి, అందులో కూర్చున్న వ్యక్తికి అందరూ గౌరవం ఇవ్వాలని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. ‘మా’ ఎన్నికల ఫలితాలు వెల్లడైన సమయంలోనే జరిగిన ‘పెళ్ళి సంద-డి’ ప్రి రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. రెండేళ్ల పదవి, చిన్న పదవికి ఇన్ని గొడవలెందుకని, అందరూ కలిసి ఉండాలని పిలుపునిచ్చారు.

మోహన్ బాబుకు ఆ వ్యాఖ్యలు రుచించినట్లు లేదు. అందుకే పరోక్షంగా చిరంజీవి మీద కౌంటర్లు వేసినట్లు భావిస్తున్నారు. ఓ టీవీ కార్యక్రమంలో కొన్ని రోజుల ముందు మోహన్ బాబు మాట్లాడుతూ.. చిరంజీవి పేరెత్తకుండా ఆయన తన కొడుకును పోటీ నుంచి తప్పుకోవాలని అనడం ద్వారా తనను బాధ పెట్టినట్లు చెప్పారు. ఇదేం స్నేహం అంటూ పరోక్షంగా చిరంజీవి మీద తన అసహనాన్ని చూపించారు. ఇప్పుడు మరోసారి చిరంజీవి పేరెత్తకుండా ఆయన్ని టార్గెట్ చేశారు.

చిరంజీవి, మోహన్ బాబుల మధ్య ఒకప్పటి వైరం తెలిసిందే. తెలుగు సినిమా వజ్రోత్సవాల సమయంలో వారి మధ్య తలెత్తిన గొడవ.. ఇద్దరి మధ్య పెద్ద అగాథాన్నే సృష్టించింది. కొన్నేళ్ల పాటు ఇద్దరూ కలవలేకపోయారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య అపార్థాలు తొలగిపోయి దగ్గరయ్యారు. ముఖ్యంగా ఈ విషయంలో చిరంజీవి చొరవ చూపడంతో పాత మిత్రులు కలిసిపోయారు. గత కొన్నేళ్లలో ఇద్దరూ ఎంతో సన్నిహితంగా కనిపిస్తుండటం తెలిసిందే. రెండేళ్ల కిందట ‘మా’కు సంబంధించిన ఓ కార్యక్రమంలో వీళ్లిద్దరి అనుబంధం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఐతే ఈ మిత్రుల మధ్య ‘మా’ ఎన్నికలు చిచ్చు రేపినట్లే కనిపిస్తోంది. మరోసారి చిరు చొరవ తీసుకుంటే తప్ప రీయూనియన్ సాధ్యమయ్యేలా లేదు.