కొడుక్కి శ్రీకాంత్ అన్యాయం


హీరో కొడుకు కచ్చితంగా ఏదో ఒక దశలో హీరో అవ్వాల్సిందే. ఒకప్పుడైతే శోభన్ బాబు లాంటి కొందరు కొడుకులను హీరోలను చేయకుండా వేరే వైపు మళ్లించారు కానీ.. ఈ రోజుల్లో అలా ఎవ్వరూ ఆలోచించడం లేదు. టీనేజీలోనే వాళ్లను సినిమాల కోసం ప్రిపేర్ చేస్తున్నారు. కొన్నేళ్ల పాటు ప్లాన్ చేసి చాలా జాగ్రత్తగా లాంచ్ చేస్తున్నారు. సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. తన కొడుకు రోషన్‌ను హీరో చేయడానికే ఫిక్సయ్యాడు. కానీ కొడుకు కోసం అతడి ప్లానింగే సరిగా లేదు. ఇంతకుముందు రోషన్ నూనూగు మీసాల వయసులో ఉండగానే తొందరపడి ‘నిర్మలా కాన్వెంట్’ అనే సినిమా చేయించాడు. అది చూసిన వాళ్లు ఇంత ఔట్ డేటెడ్ సినిమా ఏంటి అన్నారు. అక్కినేని నాగార్జున ప్రొడ్యూస్ చేశాడు కాబట్టి ఆయన్ని నమ్మి శ్రీకాంత్ కొడుకును అప్పగించేశాడేమో తెలియదు కానీ.. ఆ సినిమా రోషన్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ సినిమా తీసిన దర్శకుడి వయసు అటు ఇటుగా 60 ఏళ్లు కావడం గమనార్హం.

దీని తర్వాత అయినా రోషన్ విషయంలో శ్రీకాంత్ జాగ్రత్త పడాల్సింది. కానీ రీలాంచ్ విషయంలోనూ మళ్లీ అదే తప్పు చేశాడు. ఈ తరానికి చెందిన యంగ్ డైరెక్టర్లను నమ్ముకోకుండా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. ఆయన శిష్యురాలైన గౌరి రోణంకిల చేతికి కొడుకును వదిలేశాడు.

‘పెళ్ళి సందడి’ అని తాను నటించిన క్లాసిక్ టైటిల్ పెట్టేసరికి టెంప్ట్ అయిపోయాడేమో కానీ.. కనీసం స్క్రిప్టు కూడా విన్నట్లు లేడు. ఏ కాస్త అభిరుచి ఉన్న వాళ్లయినా ఈ ‘పెళ్ళి సందడి’ కథ వింటే ఇది వర్కవుట్ కాదని చెప్పేస్తారు. రాఘవేంద్రరావు గత రెండు దశాబ్దాల్లో ఒక్క ‘శ్రీరామదాసు’ మినహా సరైన సినిమా ఏదీ తీయలేదు. భక్తి చిత్రాలను పక్కన పెడితే ఆయన్నుంచి అన్నీ ఔట్ డేటెడ్ సినిమాలే వచ్చాయి. ఆయన మరీ ముతక కథ తీసుకుని రోషన్‌ను రీలాంచ్ చేశాడు. సినిమా పూర్తిగా కూడా చూడలేక థియేటర్ల నుంచి లేచి ప్రేక్షకులు వచ్చేసే స్థాయి సినిమా ఇది.

ఇలాంటి సినిమాతో కొడుకును పూర్తి స్థాయి హీరోగా లాంచ్ చేయాలని శ్రీకాంత్ అనుకోవడం పెద్ద తప్పు. ఇలా కెరీర్ ఆరంభమయ్యాక ముందుకు సాగడం చాలా కష్టమవుతుంది. యంగ్ ఫిలిం మేకర్స్, ట్రెండీగా సినిమాలు తీస్తున్న నిర్మాతల వైపు చూడకుండా రాఘవేంద్రరావుకు కొడుకును అప్పగించడం ద్వారా కొడుక్కి శ్రీకాంత్ అన్యాయం చేసినట్లే చెప్పాలి. ఇక్కడి నుంచి రోషన్ కెరీర్ ఎలా పుంజుకుంటుందో చూడాలి.