‘పెద్దన్న’గా ఫిక్సయ్యాడు

రజినీకాంత్ నటించిన ఏ సినిమాకీ లేని కన్‌ఫ్యూజన్ ‘అన్నాత్తే’కి ఏర్పడింది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసినా.. విడుదల దగ్గర పడుతున్నా ఈ సినిమా తెలుగు రిలీజ్‌కి సంబంధించిన ఊసే లేకపోవడంతో ఇక్కడి ఫ్యాన్స్ కంగారుపడ్డారు. రీసెంట్‌గా ఏషియన్‌ సంస్థ రైట్స్ తీసుకోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మిగతా వివరాలు ఎప్పుడొస్తాయా అని వెయిట్ చేస్తున్నారు. ఇవాళ్టితో అన్ని విషయాల్లో క్లారిటీ వచ్చేసింది. రజినీ టాలీవుడ్‌కి ‘పెద్దన్న’గా రావడానికి రెడీ అవుతున్నారు.

‘అన్నాత్తే’ అంటే పెద్దన్నయ్య అని అర్థం. అయితే ఆ పేరుతో ఆల్రెడీ బాలకృష్ణ ఓ సినిమా చేశారు. పోనీ అన్నయ్య అని పెడదామంటే దాన్ని మెగాస్టార్ వాడేశారు. దాంతో ‘పెద్దన్న’ అనే పేరుని ఫిక్స్ చేశారు మేకర్స్. రీసెంట్‌గా తమిళ టీజర్ రిలీజ్ చేశారు. ఇక తెలుగు నాట ప్రమోషన్స్ మొదలుపెట్టడమే మిగిలింది.

నయనతార, కీర్తి సురేష్, ఖుష్బూ, మీనా లాంటి పాపులర్ స్టార్ట్ నటిస్తూ ఉండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. అయితే కొంతకాలంగా కథాబలం లేని సినిమాలతో రజినీ మార్కెట్ దెబ్బ తింది. ఆయన స్టైల్‌ని చూపించడానికే తీసినట్టుగా ఉన్న సినిమాలు రజినీ క్రేజ్‌ని తగ్గిస్తూ వస్తున్నాయి. అందుకే ఈసారి ఫ్యామిలీ సెంటిమెంట్కి హీరోయిజాన్ని జోడించి పండక్కి స్పెషల్ ఫీస్ట్ ఇవ్వడానికి ప్లాన్ చేశారు. పైగా సినిమా ఏషియన్ సంస్థ చేతికి వెళ్లింది కాబట్టి భారీ ఎత్తున రిలీజ్ చేయడం ఖాయం. మరి దీపావళికి పెద్దన్న సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాల్సిందే.