అఖిల్ ఏజెంట్ చ‌క‌చ‌కా..


అఖిల్ సినిమాతో ఎన్నో అంచ‌నాల మ‌ధ్య హీరోగా అరంగేట్రం చేసి.. తీవ్ర నిరాశ ఎదుర్కొన్నాడు అక్కినేని కుర్రాడు అఖిల్. అత‌ను ఆ త‌ర్వాత న‌టించిన రెండు చిత్రాలు హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను సైతం ఆడ‌లేదు. ఇప్పుడు అత‌డి ఆశ‌ల‌న్నీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ మీదే ఉన్నాయి. ఈ సినిమాతో తొలి విజ‌యాన్నందుకుంటాన‌న్న ఆశ‌తో అఖిల్ ఉన్నాడు.

ఇది బాగా ఆడితే.. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న ఏజెంట్ మూవీతో స్టార్ ఇమేజ్ సంపాదించి, అభిమానుల‌ను మురిపించాల‌ని కోరుకుంటున్నాడు. ఇంకా తొలి విజ‌యం అనుకోక‌ముందే ఇలాంటి మెగా మూవీ సెట్ కావ‌డం విశేష‌మే. ఈ చిత్రం మీద నిర్మాత అనిల్ సుంక‌ర రూ.50 కోట్ల దాకా బ‌డ్జెట్ పెట్ట‌డానికి సిద్ధ‌మైన‌ట్లు వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఐతే సినిమా అనౌన్స్ చేసి చాలా కాలం అయినా ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లిన‌ట్లు ఏమీ అప్‌డేట్ బ‌య‌టికి రాలేదు. అఖిల్, సురేంద‌ర్ క‌థా చ‌ర్చ‌ల్లో పాల్గొన్న ఫొటోలు రిలీజ్ చేశారు త‌ప్ప‌.. షూటింగ్ గురించి ఊసే లేదు. అఖిల్ చాన్నాళ్ల నుంచి ఈ సినిమా కోసం లుక్ మార్చుకుని సిద్ధ‌మ‌వుతున్నాడు కానీ.. సినిమా అస‌లెప్పుడు ప‌ట్టాలెక్కుతుంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న‌దే తెలియ‌డం లేదు.

ఐతే ఎట్ట‌కేల‌కు అఖిల్ ఏజెంట్ గురించి అప్‌డేట్ ఇచ్చాడు. ఇప్ప‌టికే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లిపోయింద‌ని వెల్ల‌డించాడు. షూటింగ్ చాలా స్పీడుగా సాగుతోంద‌ని.. ఐతే ఈ ఏడాది మాత్రం ఏజెంట్ రిలీజ్ కాద‌ని.. వచ్చే వేస‌వికి కూడా అది రిలీజ‌వుతుంద‌ని గ్యారెంటీగా చెప్ప‌లేన‌ని అన్నాడు. మొత్తానికి ఏజెంట్ షూటింగ్ మొద‌లై, స్పీడుగా జ‌రుగుతోంద‌న్న క‌బురు అక్కినేని అభిమానుల‌కు ఆనందాన్నిచ్చేదే. మ‌రి అఖిల్ ఆశిస్తున్న‌ట్లు శుక్ర‌వారం రిలీజ‌వుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ హిట్ట‌యి.. ఏజెంట్‌తో అత‌నుమ‌రో స్థాయికి చేర‌తాడేమో చూద్దాం.