హృద‌య కాలేయం త‌ర్వాత ఇన్నాళ్ల‌కు

హృద‌య కాలేయం అని పిచ్చి టైటిల్ పెట్టి కామెడీ లుక్స్ ఉన్న సంపూర్ణేష్ బాబు హీరోగా సినిమాను ప్ర‌క‌టించి.. దాన్ని ప్ర‌మోట్ చేస్తున్న‌పుడు చాలా సిల్లీగా అనిపించింది అంద‌రికీ. కానీ ఈ సెటైరిక‌ల్ మూవీని జ‌నాల్లోకి బాగా తీసుకెళ్లి, సూప‌ర్ హిట్ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు యువ ద‌ర్శ‌కుడు సాయిరాజేష్‌. తొలి సినిమాకు హాలీవుడ్ లెజెండ‌రీ డైరెక్ట‌ర్ స్టీఫెన్ స్పీల్‌బ‌ర్గ్, సౌత్ ఇండియ‌న్ టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌ల పేరు క‌లిసొచ్చేలా అత‌ను త‌న స్క్రీన్ నేమ్ స్టీఫెన్ శంక‌ర్ అని వేసుకోవ‌డం విశేషం.

ఐతే తొలి సినిమాతో మంచి హిట్ కొట్టినా.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌ట్ట‌లేదు సాయిరాజేష్‌. త‌న నిర్మాణంలో కొబ్బ‌రిమ‌ట్ట‌, క‌ల‌ర్ ఫొటో సినిమాలు మాత్రం తీశాడు. వీటికి క‌థ అందించింది అత‌నే. అవి కూడా ఉన్నంత‌లో బాగానే ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి. ఐతే తొలి సినిమా తీసిన ఏడేళ్ల త‌ర్వాత ఇప్పుడు సాయిరాజేష్ మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌ట్టుకుంటున్నాడు.

సాయిరాజేష్ ద‌ర్శ‌క‌త్వంలో బేబి పేరుతో కొత్త సినిమా మొద‌లైంది. పీఆర్వో ట‌ర్న్డ్ ప్రొడ్యూస‌ర్, సాయిరాజేష్‌కు స‌న్నిహితుడు అయిన ఎస్కేఎన్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ ఈ చిత్రంలో హీరోగా న‌టించ‌నుండ‌టం విశేషం. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి పేరు సంపాదించి.. అల వైకుంఠపుర‌ములో, ట‌క్ జ‌గ‌దీష్ లాంటి చిత్రాల్లో క్యారెక్ట‌ర్ రోల్స్ చేసిన వైష్ణ‌వి చైత‌న్య ఆనంద్‌కు జోడీగా న‌టించ‌నుంది. అన‌సూయ‌తో క‌లిసి థ్యాంక్ యు బ్ర‌ద‌ర్ సినిమా చేసిన విరాజ్ అశ్విన్ ఇందులో మ‌రో హీరో.

అల్లు అర‌వింద్, సుకుమార్, మారుతి లాంటి ప్ర‌ముఖుల చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభోత్స‌వం జ‌రుపుకుంది. సాయిరాజేష్ ఈసారి పేర‌డీలు, సెటైర్లు లాంటివి లేకుండా మామూలు సినిమానే తీయ‌బోతున్న‌ట్లు క‌నిపిస్తోంది. మ‌రి ఈ ప్ర‌య‌త్నం ఎలాంటి ఫ‌లితాన్నిస్తుందో చూడాలి.