మంచు కుటుంబంలో అందరిలోకి చాలా సరదాగా కనిపించే వ్యక్తి మంచు మనోజ్. అతనెక్కకుంటే అక్కడ సందడిగా ఉంటుంది. వివాదాల జోలికి వెళ్లకుండా అందరితోనూ చాలా కలివిడిగా ఉంటాడని అతడికి పేరుంది. టాలీవుడ్ యంగ్ హీరోల్లో చాలామందితో అతడికి మంచి స్నేహం ఉంది. అందరూ అతడి గురించి మంచిగానే మాట్లాడుతుంటారు. అనుకున్నంత సక్సెస్ ఫుల్ కాకపోవడం, ఇతర కారణాల వల్ల సోషల్ మీడియాలో మంచు విష్ణు, లక్ష్మీ ప్రసన్న బాగా ట్రోలింగ్ ఎదుర్కొంటుంటారు కానీ.. వాళ్లతో పోలిస్తే మనోజ్ మీద ట్రోలింగ్ కూడా తక్కువే అని చెప్పాలి. అలాగే వాళ్లిద్దరితో పోలిస్తే సక్సెస్ రేటు కూడా కాస్త ఎక్కువే మనోజ్‌కు.
ఐతే నాలుగేళ్లుగా సినిమాలకు దూరంగా ఉండటం వల్ల మనోజ్ కొంత జనాలకు దూరమయ్యాడు. బయట కూడా పెద్దగా కనిపించడం లేదు. సినిమాల నుంచి గ్యాప్ తీసుకోవడం, వైవాహిక జీవితంలో వైఫల్యం కూడా అతను ఇలా అందరికీ కొంత దూరం కావడానికి కారణం కావచ్చు.
ఐతే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సందర్భంగా మంచు మనోజ్ మళ్లీ చాన్నాళ్లకు వార్తల్లోకి వచ్చాడు. అన్న కోసం ప్రచారాల్లాంటివేమీ చేయలేదు కానీ.. ఎన్నికల రోజు మాత్రం అతను పోలింగ్ దగ్గర కీలకంగా వ్యవహరించాడు. ఎన్నికల్లో అక్రమాలు చేశారని, దౌర్జన్యంగా వ్యవహరించారని మోహన్ బాబు మీద కొన్ని ఆరోపణలు చేసిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ వాళ్లు కూడా మనోజ్ గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడ్డం విశేషం.
మోహన్ బాబు తీరును తప్పుబట్టిన బెనర్జీ, తనీష్, ప్రభాకర్, సమీర్ తదితరులు మనోజ్ మీద మాత్రం ప్రశంసలు కురిపించారు. మనోజ్ అనే వాడు పోలింగ్ దగ్గర లేకుంటే చాలా పెద్ద గొడవ అయ్యేదని.. రభస రభస అయ్యేదని.. అతను చాలా హుందాగా వ్యవహరించాడని.. గొడవలు జరక్కుండా అందరినీ సముదాయించాడని ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు పేర్కొనడం విశేషం. సమీర్ అయితే మనోజ్‌కు హ్యాట్సాఫ్ అని వ్యాఖ్యానించడం విశేషం. దీంతో అందరి దృష్టిలో మనోజ్ హీరో అయిపోయాడు. ఐతే ఓవైపు తన తండ్రి మీద విమర్శలు, ఆరోపణలు చేసిన వాళ్లు.. తనను పొగడ్డంతో మనోజ్ ఈ వ్యాఖ్యల మీద స్పందించలేని పరిస్థితి నెలకొంది.