ఫోర్బ్స్ కవర్ పేజీపై నయన్.. కారణం ఇదే

అంతర్జాతీయంగా పేరున్న ఫోర్బ్స్ మీడియా సంస్థ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచ కుబేరులు..ఆసియా కుబేరులు.. భారత దేశ కుబేరులు అంటూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్న ప్రముఖులు.. వ్యాపార పారిశ్రామికవేత్తల ప్రముఖుల్ని పరిచయం చేయడంతో పాటు.. వారికి ర్యాంకింగ్స్ ఇవ్వటం.. వారి ఆస్తిపాస్తుల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయటం లాంటివెన్నో చేస్తుంటుంది. ఇలాంటి ఫోర్బ్స్ కవర్ పేజీ మీద ఎప్పటికప్పుడు వ్యాపార వర్గాలకు చెందిన వారే దర్శనమిస్తుంటారు. అందుకు భిన్నంగా సినీ తారల ఫొటోలు పబ్లిష్ కావటం అరుదు.

ఒకవేళ పబ్లిష్ అయినా ఏ హాలీవుడ్ నటుడో.. నటికో అవకాశం ఉంటుందే తప్పించి.. సౌత్ స్టార్ గా రాణిస్తున్న నయనతార లాంటి ఫోటోతో కవర్ పేజీ రావటమా? అంటే అవుననే చెప్పాలి. ఎందుకిలా అంటే.. సినిమా రంగంలో ఆమె దూసుకెళుతున్న తీరుతో ఆమెకీ అవకాశం లభించింది. ఇంతకూ ఫోర్బ్స్ నయనతారను తన కవర్ పేజీ మీద ఎందుకు ఎంపిక చేసిందన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి.

తాజా కవర్ పేజీ మీద నయనతారతో పాటు.. దుల్కర్ సల్మాన్.. యష్ లను ఎంపిక చేసింది. సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ మీద ఫోకస్ చేసిన ఈ మీడియా సంస్థ.. సౌత్ ను ప్రభావితం చేస్తున్న నటుల్ని ఎంపిక చేయగా.. ఈ ముగ్గురు తేలారు. దక్షిణాదికే పరిమితం కాకుండా బాలీవుడ్ లోనూ తమ సత్తా చాటటం వీరి ప్రత్యేకతగా చెప్పాలి. ఇక.. నయనతార గురించి వస్తే.. తెలుగు.. తమిళ.. మలయాళ చిత్రాల్లో ఆమె దూసుకెళుతున్నారు.

మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంటే ఈ రంగంలో లేడీ సూపర్ స్టార్ అన్న టైటిల్ ను సొంతం చేసుకోవడం లో ఆమె ముందున్నారు. కరోనా వేళ.. మారిన గేమ్ ప్లాన్ కు తగ్గట్లుగా తమను తాము మార్చుకుంటూ ఓటీటీ మీద దూసుకెళుతున్న వారిలో ఈ ముగ్గురు ఉన్నారు. అందుకే.. ఈసారి నయన్ ప్రముఖ మీడియా సంస్థ కవర్ పేజీ మీద దర్శనమిచ్చారని చెప్పాలి.