నందమూరి హీరోలకు ఇది పెద్ద దెబ్బే

టాలీవుడ్ ఓ విషాద వార్తతో నిద్ర లేచింది ఈ రోజు. ప్రముఖ పీఆర్వో, నిర్మాత మహేష్ కోనేరు గుండెపోటుతో హఠాత్తుగా చనిపోవడం అందరికి పెద్ద షాకే. ఇండస్ట్రీలో చాలా మంచి పేరున్న వ్యక్తి, నిర్మాతగా ఎదుగుతున్న దశలో, తక్కువ వయసులో ఇలా హఠాత్తుగా కన్నమూయడం పరిశ్రమలోని వారికే కాదు.. సినీ అభిమానులకు కూడా జీర్ణించుకోలేని విషయమే. మహేష్ మృతి నందమూరి అన్నదమ్ములు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లకు ఎంత పెద్ద లోటు అన్నది వారి సన్నిహితులకే తెలుసు. ఒక రకంగా కుటుంబ సభ్యుణ్ని కోల్పోయిన బాధలోనే ఉన్నారు వాళ్లిద్దరూ. గత కొన్నేళ్లలో సోదరుడు జానకిరామ్, తండ్రి హరికృష్ణలను రోడ్డు ప్రమాదాల్లో కోల్పోయారు తారక్, కళ్యాణ్ రామ్. ఇప్పుడు సినిమాల పరంగా తమకు అన్నీ చూసుకునే వ్యక్తిని దూరం చేసుకున్నారు.

సినిమాల కోసం, అలాగే హీరోల కోసం పీఆర్వోలు పని చేయడం ఇండస్ట్రీలో మామూలే. ఐతే మహేష్.. తారక్, కళ్యాణ్ రామ్‌లకు కేవలం పీఆర్వో మాత్రమే కాదు.. అంతకుమించి అవసరాలు తీర్చే వ్యక్తి. వీళ్లిద్దరి డేట్లను మేనేజ్ చేసేది అతనే. వీళ్లిద్దరి ప్రతి సినిమాలోనూ ఏదో రకంగా మహేష్ భాగస్వామ్యం ఉంటుంది. కథలు వినడం, కాంబినేషన్లు సెట్ చేయడం, మీడియా వ్యవహారాలను చూడటం.. అలాగే అభిమానులతో కోఆర్డినేషన్, సోషల్ మీడియా మేనేజ్మెంట్.. ఇలా చాలా పనులే చేసిపెడతాడు మహేష్.

కళ్యాణ్ రామ్‌కు సంబంధించి ఎన్టీఆర్ ఆర్ట్స్ వ్యవహారాలను కూడా చాలా వరకు చక్కబెట్టేది మహేషే. తారక్, కళ్యాణ్ రామ్‌లకు సంబంధించి ఏ వార్త మీడియాకు చేరాలన్నా.. వారి నుంచి ఏ క్లారిఫికేషన్ రావాలన్నా.. అది మహేష్ నుంచే ఉంటుంది.

నిర్మాతగా మారాక కూడా ఈ పనులన్నీ కొనసాగిస్తున్నాడు మహేష్. తమకింత చేస్తున్నాడు కాబట్టే అతను నిర్మాతగా మారడానికి, వరుసగా సినిమాలు నిర్మించడానికి సహకారం అందిస్తున్నారు నందమూరి అన్నదమ్ములు. ఇంతగా వారు ఆధారపడే వ్యక్తి ఇప్పుడిలా అర్ధంతరంగా తనువు చాలించడం ఈ బ్రదర్స్‌కు పెద్ద దెబ్బే. తారక్ ‘ఆర్ఆర్ఆర్’తో కెరీర్లో మరో స్థాయికి చేరబోతున్న తరుణంలో ఆ సినిమా చూడకుండానే మహేష్ వెళ్లిపోవడం కూడా అతడి సన్నిహితులను మరింత బాధ పెడుతోంది.