అపుడు పవన్, ఇపుడు బిగ్ బి

సెలబ్రిటీలకు బలం వారిని అమితంగా అభిమానించే అభిమానులే. అలాంటప్పుడు.. ఆ అభిమానుల గురించి అన్ని జాగ్రత్తల్ని తీసుకోవాల్సిన అవసరం సెలబ్రిటీలకు ఉండదా? అన్నది ప్రశ్న. ఎందుకు ఉండాలని కొందరు ప్రశ్నిస్తే.. నిజమే.. తప్పనిసరిగా ఉండాల్సిందేనన్న మాట ఇంకొందరి నుంచి వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే.. అభిమాన గణం పెరిగే కొద్దీ.. సదరు సెలబ్రిటీ స్టేటస్ పెరుగుతూ ఉంటుంది. అందుకే.. అభిమానుల్ని అపురూపంగా చూసుకుంటూ.. వారి బాగోగుల గురించి ఆలోచిస్తామన్న భావన కూడా.. వారి ఫ్యాన్ మొయిల్ పెరిగేందుకు దోహదం చేస్తుంది.

సెలబ్రిటీల గురించి సామాన్యులు ఆలోచించినంత ఎక్కువగా.. సామాన్యుల గురించి సెలబ్రిటీలు ఆలోచిస్తారా? అన్నది ప్రశ్న. దీనికి సమాధానంగా తాజాగా బిగ్ బి గురించి చెప్పుకోవాలి. ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ కొన్నేళ్ల క్రితం ఈ తరహా నిర్ణయాన్ని తీసుకున్నారు. సాఫ్ట్ డ్రింక్స్ కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బ తింటుందని.. దానిలో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయన్న ప్రచారం వచ్చినంతనే.. తాను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న వాటికి గుడ్ బై చెప్పేశారు.

తాజాగా ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ కమ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైతం ఇలాంటి నిర్ణయాన్నే తీసుకున్నారు. ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న పాన్ మసాలా బ్రాండ్ కు ప్రచారం చేయకూడదని నిర్ణయించుకున్నారు. అంతేకాదు.. బ్రాండ్ ప్రమోషన్ కోసం ఇచ్చిన మొత్తాన్ని కూడా వెనక్కి ఇచ్చేసినట్లుగా చెప్పారు. పాన్ మసాలా ప్రకటనలో నటించేందుకు అమితాబ్ ఓకే చెప్పటంపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతే.. దీంతో.. వెనక్కి తగ్గిన బిగ్ బి.. ఆరోగ్యాన్ని దెబ్బ తీసే ఉత్పత్తులకు తాను ప్రచారకర్తగా ఉండకూడదన్న నిర్ణయాన్ని తీసుకోవటంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే అమితాబ్ ఆఫీస్ పేరుతో ఆన్ లైన్ లో ఒక వివరణ వైరల్ గా మారింది. పాన్ మసాలాలకు సంబంధించిన ఒక బ్రాండ్ కు అంబాసిడర్ గా ఒప్పుకునే సమయంలో వాస్తవాలు తెలియకపోవడంతో ఓకే చెప్పారని.. ఆ తర్వాత వాస్తవాలు తెలియటంతో ఆ ఒప్పందం నుంచి బయటకు వచ్చినట్లుగా పేర్కొన్నారు. సరైన నిర్ణయాన్ని తీసుకున్న బిగ్ బి బాటలో మిగిలిన సెలబ్రిటీలు.. స్టార్లు కూడా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.