చిరంజీవిపై మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!

అక్టోబర్ 10న జరిగిన ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ప్యానెల్ సభ్యులకు కూడా ఎక్కువ పదవులు దక్కాయి. దీంతో తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు మంచు విష్ణు. ఈ క్రమంలో ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. నాగబాబు, ప్రకాష్ రాజ్ ల రాజీనామాలను స్వీకరించడం లేదని.. త్వరలోనే ఇద్దరినీ కలిసి వ్యక్తిగతంగా ఆ విషయాన్ని చెప్పి.. వాళ్ల సపోర్ట్ కావాలని కోరతానని అన్నారు. ప్రకాష్ రాజ్ గారి సలహాలు, పెద్దరికం ‘మా’కు అవసరమని అన్నారు.

ఆ తరువాత రామ్ చరణ్ ఓటు కచ్చితంగా ప్రకాష్ రాజ్ గారికే వేసి ఉంటారని అన్నారు మంచు విష్ణు. ఎందుకంటే రామ్ చరణ్ తన తండ్రి మాటను జవదాటరని.. అది మంచి విషయమే అని.. తను కూడా తన తండ్రి మాటకే కట్టుబడి ఉంటానని అన్నారు. తనకు చరణ్ ఓటు వేయలేదనే బాధ లేదని అన్నారు.

‘నన్ను ఎలెక్షన్స్ నుంచి తప్పుకోమని చిరంజీవి అంకుల్ మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పారు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు మంచు విష్ణు. ప్రకాష్ రాజ్ గారు పోటీ చేస్తున్నారని.. ఎలెక్షన్స్ ఎందుకు ఆయన్నే ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నుకుందామని చిరంజీవి గారు చెబితే.. కుదరని నేపథ్యంలో ఎన్నికలు వచ్చాయని మంచు విష్ణు వివరించారు.

ఆ తరువాత ఎన్టీఆర్ ఎందుకు ఓటు వేయలేదనే విషయంపై స్పందిస్తూ.. వ్యక్తిగత కారణాల వలన రాలేకపోయారని.. కానీ తను గెలిచిన వెంటనే వచ్చిన ఫస్ట్ ఫోన్ కాల్ తారక్ నుంచే అని చెప్పారు మంచు విష్ణు. అతడి సపోర్ట్ ఎప్పుడూ తనకు ఉంటుందని అన్నారు.