ఎంతో ఉత్కంఠ రేపిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిశాయి. ఎన్నికలు జరిగిన రోజే ఫలితాలు కూడా వచ్చేశాయి. కొన్ని రోజుల ముందు వరకు అధ్యక్ష పదవికి ఫేవరెట్ అనుకున్న ప్రకాష్ రాజ్ వెనుకబడిపోయారు. మంచు విష్ణు వంద ఓట్లకు పైగా ఆధిక్యంతో అధ్యక్షుడిగా గెలుపొందాడు. ఈ ఫలితం వెలువడినప్పటి నుంచి సోషల్ మీడియా జనాలకు మెగా ఫ్యామిలీ టార్గెట్ అయిపోయింది. ఎందుకంటే ప్రకాష్ రాజ్.. మెగా ఫ్యామిలీ మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచారు.
‘మా’ అధ్యక్షుడిగా తాను ఏదో చేయాలనుకుంటున్నట్లు, తనకు ఎంతో చేసిన తెలుగు సినీ పరిశ్రమ రుణం తీర్చుకోవాలనుకుంటున్నట్లు ఎన్నికల హడావుడి మొదలవడానికి ముందే ప్రకాష్ రాజ్.. నాగబాబు, చిరంజీవి లాంటి వాళ్లను కలవడం.. వాళ్లు ‘గో అహెడ్’ అనడంతో ఆయన రేసులోకి వచ్చారు. ఐతే మంచు విష్ణు లాంటి బలమైన క్యాండిడేట్ రాకతో కథ మలుపు తిరిగింది. చివరి రోజుల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని అధ్యక్షుడిగా విష్ణునే విజయం సాధించాడు.
ఐతే మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసిన ప్రకాష్ రాజ్ ఓడిపోయాడు కాబట్టి.. ఇండస్ట్రీలో ‘మెగా’ బ్రాండ్‌కు విలువ లేకుండా పోయిందంటూ సోషల్ మీడియాలో ఓ వర్గం ట్రెండ్ మొదలుపెట్టింది. ఎవరు కాదన్నా ఎవరు ఔనన్నా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ హీరోలదే ఆధిపత్యం. వాళ్ల సినిమాలకు వచ్చే కలెక్షన్లు వేరు. వాళ్ల సినిమాల బడ్జెట్లు వేరు. అలాగే సక్సెస్ రేట్ కూడా వేరుగా ఉంటుంది. ఇది చూసి చాలామందికి అసూయ అనడంలో మరో మాట లేదు. ఇండస్ట్రీలో మెజారిటీ రికార్డులు కూడా మెగా హీరోల పేరిటే ఉండటం, వాళ్ల రేంజి అంతకంతకూ పెరుగుతుండటంతో అందుకు తగ్గట్లే అసూయ కూడా పెరుగుతుంటుంది. ఈ నేపథ్యంలోనే వాళ్లు రాజకీయంగానో మరో రకంగానో ఫెయిల్యూర్లు చవిచూస్తే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఓ వర్గం రెడీగా ఉంటుంది.
ఇప్పుడు ‘మా’ ఎన్నికల విషయంలో అదే జరుగుతోంది. నిజానికి చిరంజీవి ప్రకాష్ రాజ్‌కు బహిరంగ మద్దతు పలికి ఉంటే, పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుంటే కథ వేరుగా ఉండేది. మెగా ఫ్యామిలీలో నాగబాబు మినహా ఎవరూ ప్రకాష్ రాజ్‌కు నేరుగా మద్దతు ఇవ్వకపోవడం, వ్యూహాత్మకంగా వ్యవహరించకపోవడం వల్ల ఆయన ఓడిపోయారు. అయినా కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్లోని ఇతరులు విష్ణు ప్యానెల్‌కు దీటుగా గెలవడం గమనార్హం. నాన్ లోకల్ ఫ్యాక్టర్ ప్రకాష్‌కు ప్రతికూలమై, కొన్ని అంశాలు విష్ణుకు ప్లస్ అయి అతను గెలిచినంత మాత్రాన #Endofmega అని హ్యాష్ ట్యాగ్ పెట్టి పైశాచిక ఆనందం పొందడం విడ్డూరం.