ఆహా.. ఇంకో లెవెల్‌కు


ఒక తెలుగు నిర్మాత కేవ‌లం తెలుగు కంటెంట్‌తో ఓటీటీ పెట్టి నెగ్గుకు రాగ‌ల‌ర‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. అల్లు అర‌వింద్ ఆధ్వ‌ర్యంలో ఆహా పేరుతో గ‌త ఏడాది ఓటీటీలో రాబోతోంద‌ని వార్త‌లొచ్చిన‌పుడు నెట్ ఫ్లిక్స్, అమేజాన్, హాట్ స్టార్ లాంటి స్ట్రీమింగ్ జెయింట్ల నుంచి పోటీని త‌ట్టుకుని మ‌న లోక‌ల్ ఓటీటీ ఏమేర నిల‌బడుతుందో అని సందేహించిన వాళ్లే ఎక్కువ‌. కానీ క‌లిసొచ్చిన క‌రోనా టైంను చ‌క్క‌గా ఉప‌యోగించుకుని.. చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ బాగానే నిల‌దొక్కుకుంది ఆహా.

అంచ‌నాల్ని మించి స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను ఆకర్షించిన ఆహా.. ఇప్ప‌టిదాకా డ‌బ్బింగ్ చిత్రాల‌కు తోడు.. తెలుగులో వ‌చ్చే చిన్న‌, మీడియం రేంజ్ సినిమాల‌తోనే నెట్టుకొస్తోంది. ఎప్పుడో ఒక‌సారి మాత్ర‌మే పేరున్న చిత్రాలు ఆహాలో రిలీజ‌వుతున్నాయి. కానీ ఇప్పుడు ఆహా మ‌రో స్థాయికి వెళ్ల‌డానికి భారీ ప్ర‌ణాళిక‌ల‌తోనే సిద్ధ‌మైంది. ఆహా వారి తాజా ప్రోమో చూస్తే ఈ విష‌యం అర్థ‌మైపోతుంది.

క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత టాలీవుడ్లో అతి పెద్ద విజ‌యం సాధించిన ల‌వ్ స్టోరి సినిమా ఈ నెల 22న ఆహాలో రాబోతోంది. ఇది మాత్ర‌మే కాదు.. ద‌స‌రా కానుక‌గా రిలీజ‌య్యే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్, అర‌వింద్ కొడుకు అల్లు బాబీ నిర్మిస్తున్న వ‌రుణ్ తేజ్ సినిమా గ‌ని, నాగ‌శౌర్య మూవీ ల‌క్ష్య‌, ఆనంద్ దేవ‌ర‌కొండ మూవీ పుష్ప‌క విమానం, సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టించిన డీజే టిల్లు, మారుతి మూవీ మంచి రోజులు వ‌చ్చాయి, పూరి ఆకాశ్ న‌టించిన రొమాంటిక్, రాజ్ త‌రుణ్ కొత్త చిత్రం అనుభ‌వించు రాజా.. ఇలా రాబోయే మూడు నెల‌ల్లో క్రేజీ సినిమాలు చాలానే ఆహాలోకి రాబోతున్నాయి.

ఇవి కాక మారుతి ప్రొడ‌క్ష‌న్లో తెర‌కెక్కిన 3 రోజెస్, ప్రియ‌మ‌ణి, రాజేంద్ర ప్ర‌సాద్ వేర్వేరుగా న‌టించిన ఒరిజిన‌ల్స్ సహా వెబ్ సిరీస్‌లు కూడా పెద్ద ఎత్తునే ఆహాలో ప్ర‌సారం కాబోతున్నాయి. ఇవ‌న్నీ ఒకెత్త‌యితే.. నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్‌గా చేస్తున్న అన్ స్టాప‌బుల్ టాక్ షో కూడా ఆహాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌బోతోంది. ఈ ప్లాన్స్ చూస్తుంటే ఆహా నెక్స్ట్ లెవెల్ ఎంట‌ర్టైన్మెంట్లోకి అడుగు పెడుతున్న‌ట్లే ఉంది.