పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. క్రిష్ లాంటి విలక్షణ దర్శకుడితో పవన్ సినిమా చేయడమే ఆశ్చర్యం అంటే.. వీళ్లిద్దరి కలయికలో ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా రావడం ఇంకా ఆశ్చర్యం. ఈ సినిమా మొదలైనపుడు పెద్దగా అంచనాల్లేవు కానీ.. దీని ఫస్ట్ టీజర్ చూడగానే అంచనాలు పెరిగిపోయాయి.
ఇది పవన్ కెరీర్లో ఒక బాహుబలి అవుతుందన్న ఆశలు కలిగాయి. ఈ సినిమా మీద ఇంకా అంచనాలు పెంచే మాటలు చెప్పాడు క్రిష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో. ఈ సినిమా ప్రేక్షకులకు షాకిచ్చేలా ఉంటుందని క్రిష్ చెప్పాడు. ఇదొక షాకర్.. ఇలాంటి సినిమా నేనూ చేయలేదు.. ఇప్పటిదాకా తెలుగులో రానే లేదు అని క్రిష్ ధీమాగా చెప్పడం విశేషం.
చరిత్రలో ఉన్న కొన్ని ఉదంతాలు, పాత్రలను తీసుకుని.. వాటికి తనదైన కథాకథనాలు జోడించి హరిహర వీరమల్లు సినిమాను రూపొందించినట్లు క్రిష్ తెలిపాడు. ఇలాంటి సినిమాలో పవన్ కళ్యాణ్ నటించడం అన్నిటికంటే ప్రత్యేకమైన విషయం అని.. వీరమల్లు పాత్రలో పవన్‌ను చూడగానే తాను చాలా ఎగ్జైట్ అయిపోయానని క్రిష్ అన్నాడు.
ఇప్పటిదాకా హరిహర వీరమల్లు షూటింగ్ సగం పూర్తయిందని.. సినిమా ఆరంభ సన్నివేశం నుంచి సీక్వెన్స్‌లో సినిమా తీస్తూ ముందుకెళ్తున్నామని.. ఇంటర్వెల్ ముంగిట చిన్న సన్నివేశం మినహా ఫస్ట్ హాఫ్ వరకు సినిమా పూర్తయిందని.. త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలవుతుందని క్రిష్ చెప్పాడు. ఈ సినిమా చేస్తుండగా, మధ్యలో బ్రేక్ తీసుకుని కొండపొలం సినిమా చేయడానికి పవన్, నిర్మాత ఎ.ఎం.రత్నం అంగీకరించడం గొప్ప విషయమని, ఇందుకు వారికి కృతజ్ఞుడనని క్రిష్ అన్నాడు. హరిహర వీరమల్లు వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates