రెహ‌మాన్ బ‌తుక‌మ్మ పాట బాగుంది కానీ..

తెలంగాణ సంస్కృతికి అద్దం ప‌ట్టే పండుగ బ‌తుక‌మ్మ‌. ద‌స‌రా స‌మ‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా బ‌తుక‌మ్మ సంబ‌రాలు అంబ‌రాన్నంటుతాయి. ఈ వేడుక‌ల‌ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప‌ల్లె పాట‌లు చాలానే వ‌చ్చాయి. ఐతే ఇప్పుడు ఇద్ద‌రు లెజెండ‌రీ ఫిలిం సెల‌బ్రెటీలు.. బ‌తుక‌మ్మ నేప‌థ్యంలో పాట తీర్చిదిద్ద‌డానికి ముందుకు వ‌చ్చారు. వాళ్లేమీ తెలుగువాళ్లు కాదు. త‌మిళులు. ప్ర‌ముఖ కోలీవుడ్ ఫిలిం మేక‌ర్ గౌత‌మ్ మీన‌న్, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్.రెహ‌మాన్ క‌లిసి ఈ పాట‌ను తీర్చిదిద్ద‌డం విశేషం.

అల్లిపూల వెన్నెల అంటూ సాగే ఈ పాట‌ను రెహ‌మాన్ కంపోజ్ చేస్తే.. గౌత‌మ్ మీన‌న్ చిత్రీక‌రించాడు. రెహ‌మాన్ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూ చ‌క్క‌టి ట్యూన్ ఇస్తే.. గౌత‌మ్ మీన‌న్ అందంగా పాట‌ను పిక్చ‌రైజ్ చేశాడు. మామూలుగా చూస్తే ఈ పాట చాలా బాగుంద‌నే చెప్పాలి. పాట శ్రావ్యంగా ఉంది. విజువ‌ల్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి.

కానీ ఇది తెలంగాణ స్ట‌యిల్లో సాగిందా, ఇక్క‌డి జ‌నాల‌కు అంత ఉత్సాహాన్నిస్తోందా అంటే మాత్రం లేద‌నే చెప్పాలి. బ‌తుక‌మ్మ పాటలంటేనే ఒక ఊపు ఉంటుంది. ఆ ఉత్సాహ‌మే వేరుగా ఉంటుంది. ముఖ్యంగా ప‌ల్లె ప‌డుచులు పాడుకుంటున్న‌ట్లు.. కొంచెం మాస్‌గా, నాటుగా కూడా ఉంటాయి బ‌తుక‌మ్మ పాట‌లు. అలా ఉంటేనే వాటిలో స‌హ‌జ‌త్వం ఉంటుంది. తెలంగాణ జ‌నాలు ఈజీగా క‌నెక్ట‌వుతారు. కానీ రెహ‌మాన్ పాట మ‌రీ క్లాస్‌గా తయారైంది. విజువ‌ల్స్ సైతం క్లాస్‌గానే క‌నిపించాయి.

మంచి పాట అనిపించినా.. ఇది మ‌న పాట అనుకునేలా లేదు అన్న‌ది లోక‌ల్ జ‌నాల మాట‌. సోష‌ల్ మీడియాలో కూడా ఇదే ఫీడ్ బ్యాక్ క‌నిపిస్తోంది. ఈ పాట‌కు ఇంత ఖ‌ర్చు, అంత‌టి లెజెండ్స్ అవ‌స‌రం లేద‌ని.. మంగ్లీ లాంటి వాళ్ల‌తో పాట పాడించి.. లోక‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌తోనే ట్యూన్ చేయించి, ఇక్క‌డ‌మ్మాయిల‌ విజువ‌ల్స్ తీసుకుంటే స‌రిపోయేద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.