అల్లు అర్జున్ అందుకే ఆగాడా?

అల్లు అర్జున్-సుకుమార్‌ల క్రేజీ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతున్న‌ పుష్ప మూవీ రెండు భాగాలుగా రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే. అందులో ఫ‌స్ట్ పార్ట్ అయిన పుష్ప‌-ది రైజ్‌ను ఈ ఏడాది క్రిస్మ‌స్ కానుక‌గా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తాజాగా రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు. క్రిస్మ‌స్‌కు వారం ముందే, అంటే డిసెంబ‌రు 17న పుష్ప-1 వ‌స్తుంద‌ని చిత్ర నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించింది. కానీ దీని గురించి హీరో అల్లు అర్జున్ మాత్రం ట్వీట్ వేయ‌లేదు.

మామూలుగా త‌న సినిమాల‌కు సంబంధించి ఏ అప్ డేట్ అయినా బ‌న్నీ ట్వీట్ రూపంలో అభిమానుల‌తో పంచుకుంటాడు. కానీ పుష్ప రిలీజ్ డేట్ గురించి మాత్రం అత‌ను ట్వీట్ వేయ‌లేదు. ఇది య‌ధాలాపంగా విస్మ‌రించిన విష‌యం కాద‌ని.. విడుద‌ల తేదీ విష‌యంలో బ‌న్నీ డోలాయ‌మానంలో ఉన్నాడే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ డేట్ ఫైన‌ల్ కాదేమో అన్న సందేహాలు కూడా క‌లుగుతున్నాయి.

ఇందుకు కార‌ణం లేక‌పోలేదు. మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్య‌ను కూడా క్రిస్మ‌స్ బ‌రిలో దించాల‌ని చూస్తున్న‌ట్లుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంకా చెప్పాలంటే డిసెంబ‌రు 17కే ఈ సినిమాను ఖ‌రారు చేసిన‌ట్లుగా కూడా సోష‌ల్ మీడియాలో వార్త‌లొస్తుండ‌టం విశేషం.

ద‌స‌రాకు కానీ.. దీపావ‌ళికి కానీ ఆచార్యను రెడీ చేయ‌లేకపోగా.. సంక్రాంతికి ఆల్రెడీ బెర్తులు బుక్ అయిపోయాయి. వేస‌వి వ‌రకు సినిమాను ఆపే ప‌రిస్థితి లేదు. దీంతో క్రిస్మ‌స్ టైంలోనే రిలీజ్ చేయాల‌నుకుంటున్న‌ట్లుగా చిత్ర బృందం నుంచి స‌మాచారం బ‌య‌టికొస్తోంది. కానీ పుష్ప కూడా అదే సీజ‌న్‌కు రెడీ అవుతుండ‌టంతో రిలీజ్ డేట్ విష‌యంలో ఏం చేద్దామ‌నే సందిగ్ధ‌త నెల‌కొంది. మ‌రి ఈ రెండు చిత్రాల మేక‌ర్స్ మ‌ధ్య రిలీజ్ డేట్ విష‌యంలో ఏం స‌ర్దుబాటు జ‌రుగుతుందో.. ఏది ఏ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుందో చూడాలి.