మ‌హేషా.. ప‌వ‌నా.. డ్రాప్ అయ్యేదెవ‌రు?


మొత్తానికి ఆర్ఆర్ఆర్ విడుద‌ల విష‌యంలో ఒక క్లారిటీ వ‌చ్చేసింది. ఒక ద‌శ‌లో 2021 జ‌న‌వ‌రి 8న రిలీజ్‌కు రెడీ అయిన ఆ సినిమా.. ఇంకో ఏడాది ఆల‌స్యంగా 2022 జ‌న‌వ‌రి 7కు ఫిక్స్ అయింది. ఇప్ప‌టికే మూడుసార్లు రిలీజ్ డేట్ మారిన నేప‌థ్యంలో మ‌రోసారి సినిమాను వాయిదా వేసే అవ‌కాశం దాదాపు లేన‌ట్లే. ఇప్ప‌టికే షూటింగ్ కూడా అయిపోయింది, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కూడా ఫుల్ స్వింగ్‌లోనే ఉంది కాబ‌ట్టి రాజ‌మౌళి వైపు నుంచి ఆల‌స్యం జ‌రిగే అవ‌కాశం లేన‌ట్లే. ఇంకోసారి డేట్ మారిస్తే క‌చ్చితంగా ఆర్ఆర్ఆర్ టీం న‌వ్వుల పాల‌వుతుంది.

కాబ‌ట్టి 2022 జ‌న‌వ‌రి 7కు ప‌క్కాగా సినిమా రాబోతున్న‌ట్లే. అలాంట‌పుడు ఇంకో అయిదు రోజుల గ్యాప్‌తో వ‌రుస‌గా తెలుగులో మూడు భారీ చిత్రాలు రిలీజ్ చేసే స్కోప్ ఉందా అన్న‌ది ప్ర‌శ్న‌. ఈ మూడు చిత్రాలూ ఆషామాషీవేమీ కాదు. ప్ర‌భాస్, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌హేష్ బాబు న‌టించిన‌వి.

జ‌న‌వ‌రి 12న భీమ్లా నాయ‌క్, 13న స‌ర్కారు వారి పాట‌, 14న రాధేశ్యామ్ చిత్రాల‌కు డేట్లు ఇవ్వ‌డం తెలిసిందే. ఇటీవ‌లే రాధేశ్యామ్ టీం మ‌రోసారి జ‌న‌వ‌రి 14నే త‌మ సినిమా రాబోతున్న‌ట్లు నొక్కి వ‌క్కాణించింది. ఆర్ఆర్ఆర్‌, రాధేశ్యామ్ చిత్రాల‌కున్న ఇబ్బందేంటంటే.. అవి పాన్ ఇండియా సినిమాలు. వేరే భాష‌ల్లో చిత్రాల సంగతి కూడా చూసుకుని రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఇవి కాదంటే మ‌ళ్లీ ఇంకో డేట్ దొర‌క‌డం అంత తేలిక కాదు. ఇవి రెండూ ఇప్ప‌టికే చాలా ఆల‌స్య‌మ‌య్యాయి కాబ‌ట్టి ఇప్పుడ‌నుకున్న డేట్ల‌కు ప‌క్కాగా విడుద‌ల కావాల్సిందే.

మ‌రి వీటికి తోడుగా ప‌వ‌న్, మ‌హేష్ సినిమాల‌ను రిలీజ్ చేసే వీలుందా అంటే లేద‌నే చెప్పాలి. థియేట‌ర్ల స‌ర్దుబాటు చాలా క‌ష్టం. నాలుగు చిత్రాల‌కూ థియేట‌ర్లు పంచితే.. అంద‌రికీ ఇబ్బందే. వ‌సూళ్ల‌పై చాలా ప్ర‌భావం ప‌డుతుంది. బ‌డ్జెట్లు రిక‌వ‌ర్ కావ‌డం చాలా క‌ష్టం. మంచి టాక్ వ‌చ్చినా ఆశించిన ఫ‌లిత‌ముండ‌దు. ఇక‌ ఏదైనా సినిమాకు టాక్ అటు ఇటుగా వ‌స్తే మాత్రం అంతే సంగ‌తులు. కాబ‌ట్టి ప‌వ‌న్, మ‌హేష్ చిత్రాల్లో ఒక్క‌టైనా వెన‌క్కి త‌గ్గాల్సిందే. రెండూ త‌గ్గితే ఇంకా మంచిది. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కార‌మైతే స‌ర్కారు వారి పాట వేసవికి వాయిదా ప‌డ‌టం ఖాయ‌మంటున్నారు. భీమ్లా నాయ‌క్ గ‌ణతంత్ర దినోత్స‌వానికి వాయిదా ప‌డే సూచ‌న‌లూ ఉన్నాయి.