ల‌వ్ స్టోరికి ఎంతొచ్చింది.. ఇంకెంతొస్తుంది?

క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్ల‌కు క‌ళ తీసుకొచ్చిన సినిమా ల‌వ్ స్టోరి. ఈ చిత్రానికి జ‌రిగిన అడ్వాన్స్ బుకింగ్స్, వ‌చ్చిన‌ ఓపెనింగ్స్ ఇండ‌స్ట్రీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. సెకండ్ వేవ్ త‌ర్వాత ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తితో ఎదురు చూసిన సినిమా ఇది. ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కు త‌గ్గ స్థాయిలో సినిమా లేకున్నా.. ఇది టికెట్ డ‌బ్బుల‌కు న్యాయం చేసే సినిమానే. తొలి వారాంతంలో హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో న‌డిచిన ల‌వ్ స్టోరి వ‌ర‌ల్డ్ వైడ్ రూ.22 కోట్ల దాకా షేర్ రాబ‌ట్టి ఔరా అనిపించింది.

ఏపీలో టికెట్ల నియంత్ర‌ణ‌, ఇత‌ర స‌మ‌స్య‌లున్నప్ప‌టికీ ఇంత షేర్ రాబ‌ట్ట‌డం విశేష‌మే. ఐతే వీకెండ్ త‌ర్వాత ఈ సినిమాకు పంచ్ ప‌డింది. డివైడ్ టాక్‌కు తోడు, ఒక రోజు బంద్‌, రెండు మూడు రోజులు వ‌ర్షాలు వ‌సూళ్లపై ప్ర‌భావం చూపాయి. దీని వ‌ల్ల తొలి వారాంతంతో పోలిస్తే తొలి వారం క‌లెక్ష‌న్లు అనుకున్నంత‌గా లేవు.

వీకెండ్ త‌ర్వాత ఐదు రోజుల్లో ఐదు కోట్ల షేర్ రాబ‌ట్టి వారం మొత్తంలో రూ.27 కోట్ల షేర్‌తో నిలిచింది ల‌వ్ స్టోరి. రెండో వీకెండ్లో కూడా ల‌వ్ స్టోరి బాగా పుంజుకునే అవ‌కాశాలు క‌నిపిస్తుండ‌టం విశేషం. ఈ వారాంతంలో రిలీజైన రిప‌బ్లిక్ సీరియ‌స్ సినిమా కావ‌డం, దానికి ఏమంత మంచి టాక్ రాక‌పోవ‌డం ల‌వ్ స్టోరికి క‌చ్చితంగా క‌లిసొచ్చేదే. శ‌నివారం విడుద‌ల కానున్న ఇదీ మా క‌థ మీద కూడా ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ఆస‌క్తి క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో రెండో వారంలో కూడా ల‌వ్ స్టోరినే ప్రేక్ష‌కుల‌కు ఫ‌స్ట్ ఛాయిస్ అయ్యే అవ‌కాశాలున్నాయి.

కాబ‌ట్టి ఈ చిత్రం రూ.30 కోట్ల షేర్ మార్కును దాట‌డం లాంఛ‌నం లాగే ఉంది. ఫుల్ ర‌న్ షేర్ రూ.32-33 కోట్ల దాకా ఉండే అవ‌కాశ‌ముంది. క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత ఏ సినిమా కూడా ఇందులో స‌గం షేర్ కూడా రాబ‌ట్ట‌లేదు. దీన్ని బ‌ట్టి ల‌వ్ స్టోరి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర గొప్ప ఫ‌లితాన్నే అందుకుని భావించాలి.