అక్టోబర్ 10న జరగనున్న ‘మా’ ఎలెక్షన్స్ లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ప్రస్తుత అధ్యక్షుడు నరేష్.. మంచు విష్ణుకి మద్దతు తెలుపుతూ ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. అందులో ప్రకాష్ రాజ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే తాను చెప్పని మాటలను చెప్పానని నరేష్ అబద్దాలు ఆడుతున్నారని.. ఆయన మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలని ప్రకాష్ రాజ్ మండిపడ్డారు.
‘మీరు పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారా..? లేక ఇండస్ట్రీ వైపు ఉన్నారా..?’ అని మంచు విష్ణు ప్రశ్నించడం బాగోలేదని.. ‘పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ వ్యక్తి కాదా..?’ అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ మొదట సినీ నటుడు, ఆ తరువాతే రాజకీయనాయకుడు అని ప్రకాష్ రాజ్ అన్నారు. విష్ణు మాట్లాడేప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని.. పవన్ కళ్యాణ్ మార్నింగ్ షో కలెక్షన్ అంత లేదు మీ సినిమా బడ్జెట్ అంటూ విమర్శలు చేశారు. ఎవరి గురించైనా మాట్లాడేప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.
ఏపీ రాజకీయలు గురించి తనకు తెలియదని.. ఇండస్ట్రీ పరంగా పవన్ రెండు, మూడు ప్రశ్నలు అడిగారని.. అవి ఏ స్వరంతో అడిగారనే దానిపై మనం చర్చించుకుందామని అన్నారు. ‘మీరు పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నారా? ఇండస్ట్రీ పక్కన ఉన్నారా..?’ అని నన్ను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు ప్రకాష్ రాజ్. పవన్ కు, తనకు సిద్ధాంత పరంగా విభేదాలు ఉన్నాయని.. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారని తెలిపారు.