పవన్ మాటలతో సంబంధం లేదన్నారు.. ఇప్పుడేమో!

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను నిర్మాతల బృందం కలిసింది. అమరావతిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన నిర్మాతలు పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దిల్ రాజు, బన్నీ వాసు, సునీల్ నారంగ్, ఎర్నేని నవీన్ లాంటి ముఖ్య నిర్మాతలు పవన్ ని కలిశారు.

వీరంతా బుధవారం నాడు ఏపీ సమాచార మంత్రి పేర్ని నానిని మచిలీపట్నంలో కలిసిన సంగతి తెలిసిందే. ఒక్క రోజు తేడాతో మళ్లీ పవన్ కళ్యాణ్ ను కలవడానికి మంగళగిరి రావడం ఆసక్తి రేపుతోంది.

ఇటీవల జరిగిన ‘రిపబ్లిక్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో సినిమా ఇండస్ట్రీ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తరువాత పవన్ కు ఇండస్ట్రీ వర్గాల మద్దతు లభించలేదు. కొందరు హీరోలు తప్ప మిగిలినవారంతా గమ్మునుండిపోయారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రెస్ నోట్ కూడా వచ్చింది. ఇండస్ట్రీ కోసం మాట్లాడిన పవన్ కళ్యాణ్ ను ఒంటరి చేశారనే అభిప్రాయాలు వినిపించాయి.

ఇలాంటి సమయంలో నిర్మాతలు అమరావతి వచ్చి పవన్ కళ్యాణ్ ను కలిసి పేర్ని నానితో జరిగిన చర్చల వివరాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందించారో బయటకు రాలేదు. ప్రభుత్వంతో గొడవలు పెట్టుకోవడం కన్నా.. సామరస్యంగా అనుమతులు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో నిర్మాతలు పవన్ వ్యాఖ్యలను ఖండించారే తప్ప.. వారు పవన్ కి వ్యతిరేకం కాదని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. రీసెంట్ గా అల్లు అరవింద్ కూడా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని కోరారు.