పోసాని ఇంటిపై రాళ్ల దాడి?


పవన్ కళ్యాణ్ వెర్సస్ వైసీపీ గొడవ కాస్తా.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెర్సస్ పోసాని కృష్ణమురళి గొడవగా మారిపోతోంది. రిపబ్లిక్ ప్రి రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ వైకాపా సర్కారును తీవ్ర స్థాయిలో దుయ్యబట్టడం.. ఆ తర్వాత వైకాపా నుంచి వరుసబెట్టి నాయకులు జనసేనాని మీద మాటల దాడి చేయడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ పార్టీ మద్దతుదారు అయిన పోసాని కృష్ణమురళి కూడా ప్రెస్ మీట్ పెట్టి పవన్ మీద విమర్శలు చేశారు.

ఐతే అంతటితో కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ కొత్త గొడవ మొదలైంది. పవన్ అభిమానులు తనకు, తన భార్యకు ఫోన్ చేసి దారుణమైన మాటలు మాట్లాడారు, బెదిరించారంటూ పోసాని ప్రెస్ మీట్ పెట్టి రెచ్చిపోయారు. పవన్‌‌ను బూతులు తిడుతూ ఆయన భార్య, కూతురి గురించి దారుణమైన కామెంట్స్ చేశారు. ఆయన హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతున్నపుడే పవన్ అభిమానులు బయట గొడవ చేయడం తెలిసిందే.

కాగా ఇప్పుడు పవన్ అభిమానులు తమ ఇంటిపై రాళ్ల దాడి చేసినట్లుగా పోసాని ఆరోపిస్తుండటం గమనార్హం. గుర్తు తెలియని వ్యక్తులు తమ ఇంటిపై రాళ్లు వేశారని, వాళ్లు పవన్ అభిమానులే అని పోసాని అంటున్నారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఐతే ఇదంతా ఒక స్క్రిప్టు ప్రకారం జరుగుతున్న నాటకం అంటూ పవన్ అభిమానులు ఆరోపిస్తున్నారు. మొన్న తనకు, తన భార్యకు ఫోన్ చేసి పవన్ అభిమానులు తిట్టారని చెబుతూ పోసాని వాళ్లు ఎవరో ఏంటో వెల్లడించకుండా పవన్‌ మీద దారుణమైన వ్యాఖ్యలు చేశారని.. ఇప్పుడు మరోసారి పవన్ అభిమానులు ఇంటిపై దాడి చేశారని వివాదాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారని వారంటున్నారు.

2019 ఎన్నికలకు ముందు కత్తి మహేష్ విషయంలో జరిగినట్లే ఇప్పుడు పోసాని విషయంలోనూ జరుగుతోందని.. ఇదంతా ఏపీలో సీరియస్ ఇష్యూల మీది నుంచి దృష్టి మళ్లించేందుకు జరుగుతున్న డ్రామా అని జనసైనికులు ఆరోపిస్తున్నారు.