ఎప్పుడూ చాలా కూల్‌గా కనిపించే బాలీవుడ్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకడు. మీడియాతో మాట్లాడినా.. అభిమానులతో ముచ్చటించినా అతను కూల్‌గానే కనిపిస్తాడు. అలాంటి వాడికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది ఓ వార్త. ఆ వార్త రాసిన వెబ్ సైట్ మీద తన కోపాన్నంతా ప్రదర్శిస్తూ.. వాళ్లపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని అతను హెచ్చరికలు జారీ చేశాడు.
లాక్ డౌన్ టైంలో ముంబయిలోనే ఉండిపోయిన తన సోదరి అల్కా భాటియా, ఆమె ఇద్దరు పిల్లల్ని తిరిగి ఢిల్లీ పంపించేందుకు అక్షయ్ ప్రత్యేకంగా ఒక విమానాన్నే బుక్ చేశాడంటూ ఓ ప్రముఖ వెబ్ సైట్ వార్త రాసింది. ఇది చూసి అక్షయ్ కోపం తెచ్చుకున్నాడు. తనపై ఇలాంటి అవాస్తవాలు ప్రచురిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు.
‘‘నా సోదరి, ఆమె పిల్లల కోసం ప్రత్యేకంగా ఓ విమానాన్ని బుక్ చేశానంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. అది పూర్తి అబద్ధం. లాక్ డౌన్ ప్రారంభమైన నాటి నుంచి నా సోదరి ఎలాంటి ప్రయాణాలు చేయలేదు. ఆమెకు ఒక్కరే సంతానం. కానీ ఈ వార్తలో ఇద్దరని రాశారు. ఈ వార్త మొత్తం ఇలాగే సాగింది. ఇలాంటి అవాస్తవాలు రాస్తే లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది’’ అని అక్షయ్ హెచ్చరికలు జారీ చేశాడు.
అక్షయ్ స్పందన చూశాక సదరు వెబ్ సైట్ ఆ వార్తను తొలగించింది. కరోనా ప్రభావం మొదలయ్యాక ఎంతో పెద్ద మనసుతో స్పందించిన బాలీవుడ్ హీరోల్లో అక్షయ్ ముందుంటాడు. అతను ప్రధానమంత్రి సహాయ నిధికి ఏకంగా రూ.25 కోట్ల విరాళాన్ని ప్రకటించాడు. అలాగే ముంబయిలో వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది కోసం కూడా విరాళం అందజేశాడు. ఇంకా ముంబయిలో కొన్ని సహాయ కార్యక్రమాలు కూడా చేపట్టాడు. తాను ఇంత చేస్తుంటే తన గురించి అవాస్తవాలు ప్రచురించడంతో అతడికి కోపం వచ్చింది.