బాలీవుడ్ వాళ్లు తీసినన్ని బయోపిక్స్ మరెవ్వరూ తీయరు. ఏ ఫీల్డ్కి చెందిన వ్యక్తి జీవితాన్నయినా తెరకెక్కించడంలో వారి తర్వాతే ఎవరైనా. ఇప్పటికే చాలా బయోపిక్స్ వచ్చాయి. గంగూబాయ్ కథియావాడి, ఉధమ్ సింగ్, మిథాలీరాజ్ లాంటి మరికొన్ని రాబోతున్నాయి. ఇప్పుడు మరో లైఫ్ స్టోరీ కూడా సెల్యులాయిడ్ పైకి వెళ్లడానికి రెడీ అయ్యింది.
ఒకప్పటి ప్రముఖ పంజాబీ సింగర్ అమర్‌సింగ్ చక్మిలా జీవితాన్ని సినిమాగా తీయడానికి డిసైడయ్యాడు డైరెక్టర్ ఇంతియాజ్ అలీ. ఈ విషయం కొన్ని రోజుల క్రితమే బైటికొచ్చింది కానీ అఫీషియల్‌గా ఎవరూ చెప్పకపోవడంతో గాసిప్ అనుకున్నారంతా. కానీ ఇప్పుడు అమర్‌సింగ్ కొడుకే దీని గురించి మాట్లాడటంతో ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్ అని అర్థమయ్యింది.
ఎనభైల కాలంలో సింగర్‌గా, లిరిసిస్ట్ గా, మ్యుజీషియన్‌గా, కంపోజర్‌గా సెన్సేషన్ క్రియేట్ చేశాడు అమర్ సింగ్. ఆయన లైవ్ షోస్ చూడటానికి జనం ఎగబడేవారు. నెలలో ఎన్ని రోజులున్నాయో అంతకంటే ఎక్కువే షోస్ బుక్కయ్యేవి. 1988లో ఓరోజు ఒక షో చేయడానికి వెళ్లినప్పుడు ఆయన్ని, ఆయన భార్యని, బ్యాండ్‌లోని ఇద్దరు సభ్యుల్ని కాల్చి చంపారు.
హంతకులు ఎవరనేది ఎంతకీ అంతు పట్టలేదు. ప్రేమ వివాహం నచ్చక అత్తమామలే చంపించారని.. అమర్ రాసే పాటలు అభ్యంతరకరంగా ఉంటున్నాయనే కారణంతో సిక్కు ఖలిస్థానీ మూవ్‌మెంట్ సభ్యులే హత్య చేశారని.. తమ పాపులారిటీ తగ్గిపోతోందనే భయంతో ఓ ఇద్దరు సింగర్స్ ఈ పని చేశారని.. ఒక బడా వ్యక్తి ఇచ్చిన ఆఫర్‌ను కాదన్నాడనే కారణంతో ఆయనే చంపేశాడని.. ఇలా రకరకాల కథనాలు వినిపించాయి. కానీ ఒక్క సాక్ష్యం కూడా దొరక్కపోవడంతో ఎవరినీ అరెస్ట్ చేయలేదు. దాంతో ఆ కేసు ఓ మిస్టరీగా మిగిలిపోయింది.
అలాంటి సెన్సేషనల్ వ్యక్తి బయోపిక్ కావడం, అందులోనూ ఇంతియాజ్ లాంటి గ్రేట్ డైరెక్టర్ తీస్తుండటం ఆసక్తిని రేపుతోంది. అమర్ సింగ్, అతని భార్య అమర్‌జోత్‌ల పాత్రలకు కార్తీక్ ఆర్యన్, సారా అలీఖాన్‌లను తీసుకున్నాడట ఇంతియాజ్. ఆల్రెడీ వాళ్ల స్కెచెస్‌ని తనకు చూపించారని, కార్తీక్ తన తండ్రి పాత్రకు సరిగ్గా సరిపోతాడనిపించిందని అమర్‌సింగ్ కొడుకు జైమాన్ చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ విషయంలో పూర్తి క్లారిటీ వచ్చింది.