33 కోట్ల వ్యూస్ పాట తెర పైన తేలిపోయిందిగా కమ్ముల?

కొన్ని సినిమాలు అంతే. విడుదలకు ముందు కొన్ని పాటలతో విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది. తీరా.. సినిమా విడుదలయ్యాక.. సదరు పాట ప్రేక్షకుల ఊహకు.. అంచనాలకు తగ్గట్లుగా ఉండటం చాలా కష్టం. కరోనాకు ముందు త్రివిక్రమ్ అల వైకుంఠపురం మూవీలో సామజవరగమన పాటను తీసుకుంటే.. ఆ పాట ఎంతలా ఫేమస్ అయ్యిందో తెలిసిందే. ఆ పాట ఎలాంటి స్టిట్యూవేషన్ లో వస్తుందన్న ఆసక్తి చాలామందిలో ఉండటం.. అందుకు తగ్గట్లే ఆ పాట ఉండటంతో సినిమాకు ప్లస్ అయ్యింది.

కానీ.. తాజా లవ్ స్టోరీలో సారంగదరియా పాట పరిస్థితి ఇందుకు భిన్నమని చెప్పాలి. హుషారు ఎక్కించే ఈ పాటను యూట్యూబ్ లో రిలీజ్ చేసినప్పుడు దీని మీద జరిగిన చర్చ.. అదెంత వైరల్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పటానికి లేదు. ఆ పాట మీద ఉన్న అంచనాలు అంతా ఇంతా కావు. నిజానికి.. ఈ పాట పుణ్యమా అని.. ‘లవ్ స్టోరీ’ సినిమాకు సరికొత్త క్రేజ్ వచ్చిందనటంలో సందేహం లేదు.

అలాంటి ఈ పాట.. వెండితెర మీద చూద్దామని.. దాన్ని ఎంజాయ్ చేద్దామన్న వారికి నిరాశ కలుగక మానదు. ఎందుకంటే.. ఈ పాటకు సంబంధించి ప్రేక్షకుడు ఊహించుకునే మూడ్ కు భిన్నమైన వాతావరణంలో ఈ పాట సినిమాలో వస్తుంది. దీంతో.. ఇంత హుషారైన పాటను ఎంజాయ్ చేయలేకపోవటమే కాదు.. ఇంతలా ఎదురుచూసిన పాట.. ఇలానా? అన్న పెదవి విరుపు పలువురి నోట వినిపిస్తోంది.

యూ ట్యూబ్ లో తెలుగు పాటల పరంగా.. సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేసిన ఈ పాట.. వెండి తెర మీద ఎంజాయ్ చేసేలా లేదని.. ఆశించినంతలా లేక తేలిపోయిందంటున్నారు. ఈ పాటకు సంబంధించి హైప్ క్రియేట్ అయిన వేళ.. ఈ పాట వచ్చే సమయానికి సంబంధించి దర్శకుడు శేఖర్ కమ్ముల కాస్తంత సమాచారం ఇచ్చి.. ప్రేక్షకుల్ని మెంటల్ గా ప్రిపేర్ చేసి ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది.